ఫెడరర్‌కు షాక్
లండన్: నాలుగేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. ప్రపంచ నం. 1 నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్‌లోనే వెనుదిరగడంతో ఈసారి జరుగుతున్న వింబుల్డన్ కచ్చితంగా నెగ్గుతాడని భావించిన ఫెడరర్ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మూడోసీడ్‌గా వింబుల్డన్ బరిలో ఉన్న ఫెడరర్ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఆరోసీడ్ ఆటగాడు మిలోస్ రౌనిక్ (కెనడా) చేతిలో 3–6, 7–6, 6–4, 5–7, 3–6తో పరాజయం పాలయ్యాడు.
2010 నుంచి గ్రాండ్‌స్లామ్‌లు ఆడుతున్న రౌనిక్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. మ్యాచ్‌లో తొలిసెట్‌ను ఓడిపోయిన ఫెడరర్ రెండోసెట్‌లో పుంజుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌ను నెగ్గిన ఫెడరర్ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. మూడోసెట్‌లో 7వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో ఆధిక్యం సంపాదించాడు. నాలుగోసెట్ హోరాహోరీగా జరగగా.. ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రౌనిక్ మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక ఐదోసెట్‌ను అలవోకగా నెగ్గిన రౌనిక్ ఫైనల్లో అడుగుపెట్టాడు.