రోనిచ్ సంచలనం
* సెమీస్‌లో ఫెడరర్‌పై విజయం
* తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి
లండన్: కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే కల ఫెడరర్‌కు కలగానే మిగిలిపోతుందేమో! కొన్నేళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన నొవాక్ జొకోవిచ్ అడ్డు లేకపోయినా... ఈ స్విట్జర్లాండ్ స్టార్ వింబుల్డన్‌లో తడబడ్డాడు. కెనడా యువ కెరటం మిలోస్ రోనిచ్‌తో జరిగిన ఐదు సెట్‌ల పోరాటంలో ఈ మాజీ చాంపియన్ చేతులెత్తేశాడు. కీలక సమయంలో కళ్లు చెదిరే షాట్‌లు, తిరుగులేని సర్వీస్‌లతో హడలెత్తించిన రోనిచ్ తన కెరీర్‌లో చిరస్మరణీయ విజయం సాధించాడు.
తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెనడా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. సెంటర్ కోర్టులో శుక్రవారం 3 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఆరో సీడ్ రోనిచ్ 6-3, 6-7 (3/7), 4-6, 7-5, 6-3 మూడో సీడ్ ఫెడరర్‌ను ఓడించాడు. ఇప్పటిదాకా వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరిన 10 సార్లూ ఫెడరర్‌కు ఓటమి ఎదురుకాలేదు. కానీ ఈ స్విస్ స్టార్ జైత్రయాత్రకు రోనిచ్ తెరదించాడు.
6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న రోనిచ్ తొలి సెట్‌లోని నాలుగో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో ఫెడరర్ పుంజుకున్నాడు. కచ్చితమైన సర్వీస్‌లకు తోడు బ్యాక్‌హ్యాండ్ షాట్‌లతో అలరించాడు. 5-4తో ఆధిక్యంలో ఉన్న దశలో రోనిచ్ సర్వీస్‌లో ఫెడరర్‌కు మూడు సెట్ పాయింట్లు వచ్చాయి. అయితే రోనిచ్ నాలుగుసార్లు సెట్ పాయింట్ కాపాడుకొని గేమ్ గెలిచి స్కోరును 5-5తో సమం చేశాడు.
కానీ టైబ్రేక్‌లో ఫెడరర్ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్‌లో ఏడో గేమ్‌లో రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. అయితే 12వ గేమ్‌లో ఫెడరర్ పేలవమైన సర్వీస్‌లకు తోడు రోనిచ్ అద్భుత ఆటతీరు కారణంగా ఈ కెనడా ప్లేయర్ బ్రేక్ సాధించి సెట్‌ను 7-5తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో రోనిచ్ మరింత దూకుడుగా ఆడగా... అలసిపోయిన ఫెడరర్ ఎదురునిలువలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో రోనిచ్ 25 ఏస్‌లు.. ఫెడరర్ 16 సంధించారు. రోనిచ్ 11 డబుల్ ఫాల్ట్‌లు చేయగా... ఫెడరర్ ఐదుకే పరిమితమయ్యాడు. రోనిచ్ సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం రాగా ఫెడరర్ ఒకసారి మాత్రమే సఫలమయ్యాడు. మరోవైపు ఫెడరర్ సర్వీస్‌ను రోనిచ్ మూడుసార్లు బ్రేక్ చేశాడు. రోనిచ్ 75 విన్నర్స్ కొట్టగా... ఫెడరర్ 49 విన్నర్స్‌తో సరిపెట్టుకొని మూల్యం చెల్లించుకున్నాడు.
ముగిసిన భారత్ పోరు
ఈసారి వింబుల్డన్ టోర్నీలో భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మూడో రౌండ్‌లో నిష్ర్కమించింది. గురువారం రాత్రి ఆలస్యంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో పేస్-హింగిస్ జంట 6-3, 3-6, 2-6తో హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)-హితెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. గతేడాది హింగిస్‌తో కలిసి సానియా మహిళల డబుల్స్ విభాగంలో, పేస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్స్ సాధించారు.
సెరెనా X కెర్బర్
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేయాలనే పట్టుదలతో సెరెనా... స్టెఫీ గ్రాఫ్ (1996లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందాలనే తపనతో ఎంజెలిక్ కెర్బర్... శనివారం జరిగే మహిళల సింగిల్స్ టైటిల్ సమరానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిన సెరెనా వింబుల్డన్‌లో విజృంభిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఓడించి సంచలనం సృష్టించిన కెర్బర్ అదే ఫలితాన్ని వింబుల్డన్‌లో పునరావృతం చేస్తుందో లేదో..?
సా.గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం