హిట్... హిట్... ముర్రే | What caused Andy Murray's foul-mouthed rant during the Wimbledon final? | Sakshi
Sakshi News home page

హిట్... హిట్... ముర్రే

Published Mon, Jul 11 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

హిట్... హిట్... ముర్రే

హిట్... హిట్... ముర్రే

ఆల్ ఇంగ్లండ్ క్లబ్ మరోసారి ఆనందంతో హోరెత్తింది... మూడేళ్ల వ్యవధిలో మళ్లీ ఆ వేదిక పండగ చేసుకొంది... తమ ఇంటి బిడ్డ వింబుల్డన్ విజయంతో పులకించిపోయింది. సొంతగడ్డపై బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే సగర్వంగా రెండోసారి ట్రోఫీని అందుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ కరవు తీర్చుకుంటూ మూడో టైటిల్‌తో మురిశాడు. సెమీస్‌లో ఫెడరర్‌ని పడగొట్టిన రోనిచ్ తుది పోరులో మాత్రం ఆండీకి తలవంచాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రోనిచ్‌ను ఓడించి ముర్రే తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
 
జొకోవిచ్ ప్రమాదం ముందే తప్పింది... ఫెడరర్‌తో కూడా తలపడాల్సిన అవసరం రాలేదు... ఇలాంటి బంగారంలాంటి అవకాశాన్ని ముర్రే ఒడిసి పట్టుకున్నాడు. తాను ఆడిన గత మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ ఓడిన తర్వాత దక్కిన ఈ విజయం ముర్రేకు కొత్త ఊపిరి పోసింది. చిన్న పిల్లాడికి ఆట వస్తువు దొరికినట్లుగా వింబుల్డన్ ట్రోఫీని గట్టిగా గుండెలకు హత్తుకోవడం, మ్యాచ్ గెలిచిన తర్వాత భావోద్వేగాలు ఆపుకోలేక కన్నీళ్లు పెట్టేయడం చూస్తే అతను ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూశాడో అర్థమవుతుంది.
 
రెండోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం
ఫైనల్లో మిలోస్ రోనిచ్‌పై ఘన విజయం
రూ. 17 కోట్ల 39 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

లండన్: వింబుల్డన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ముర్రే 6-4, 7-6 (7/3), 7-6 (7/2)తో మిలోస్ రోనిచ్ (కెనడా)పై విజయం సాధించాడు.  2 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ముర్రే పూర్తి ఆధిక్యం కనబర్చాడు.

రెండు, మూడు సెట్‌లు రోనిచ్ పోరాటంతో టైబ్రేక్‌కు చేరినా, అక్కడ ముర్రేకు అనాయాస విజయం దక్కింది. 2013లో తొలిసారి వింబుల్డన్ నెగ్గిన ముర్రే ఇక్కడ టైటిల్ సాధించడం రెండోసారి. తద్వారా బ్రిటన్ తరఫున ఫ్రెడ్ పెర్రీ (3 సార్లు) తర్వాత కనీసం రెండుసార్లు విజేతగా నిలిచిన రెండో ఆటగాడిగా అతను తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. పెర్రీ గెలిచిన 80 ఏళ్ల తర్వాత ముర్రేకు మరో ట్రోఫీ దక్కింది. అతని  కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2012లో అతను యూఎస్ ఓపెన్ నెగ్గాడు. విజేతగా నిలిచిన ఆండీ ముర్రేకు 20 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 39 లక్షలు)... రన్నరప్ రోనిచ్‌కు 10 లక్షల పౌండ్లు (రూ. 8 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  
 
పోటాపోటీగా...
తన 11వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తొలిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముర్రే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి సెట్ ఆరంభంలో ముర్రే, రోనిచ్‌లు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. ఫలితంగా స్కోరు 3-3తో నిలిచింది. అనంతరం ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన ముర్రే ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. దీనిని కొనసాగించిన అతను, పదో గేమ్‌ను ఫోర్‌హ్యాండ్ వాలీ విన్నర్‌తో ముగించి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో కూడా హోరాహోరీ పోరు సాగింది. ఇద్దరు ఆటగాళ్లూ సర్వీస్‌లు కాపాడుకోగా ఒక దశలో స్కోరు 6-6తో సమమైంది. అయితే టైబ్రేక్‌లో చెలరేగిన ఆండీ సెట్‌ను కొల్లగొట్టాడు.
 
ముర్రే జోరు...
చివరి సెట్ కూడా పోటాపోటీగానే సాగింది. ఎనిమిది గేమ్‌లలో ఇద్దరు ఆటగాళ్లూ నువ్వా నేనా అనే రీతిలో ఆడారు. దీంతో 4-4 వరకు స్కోర్ సాగింది. ఈ దశలో తొమ్మిదో గేమ్‌లో వరుసగా రెండు ఏస్‌లు కొట్టి ముర్రే తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. రోనిచ్ కూడా తగ్గకపోవడంతో 6-6 స్కోరుతో మూడో సెట్ కూడా టైబ్రేక్ వరకు వెళ్లింది. ఈ దశలో వరుస పాయింట్లతో 5-0తో ముందంజ వేసిన బ్రిటన్ స్టార్ వేగంగా విజయం వైపు దూసుకుపోయాడు. రోనిచ్ కొట్టిన బ్యాక్‌హ్యాండ్ షాట్ నెట్‌కు తాకడంతో ముర్రే విజయం ఖరారైంది.
 
రోనిచ్ చేతులారా...

ఈ ఏడాది వింబుల్డన్‌లో ఫైనల్‌కు ముందు రోనిచ్ ఏకంగా 137 ఏస్‌లు కొట్టాడు. అయితే ఫైనల్లో మాత్రం కేవలం 4 ఏస్‌లకే పరిమితమయ్యాడు. చివరకు వింబుల్డన్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సర్వ్ (గంటకు 147 మైళ్ల వేగం) కూడా అతడికి పాయింట్ తీసుకురాలేకపోవడం విశేషం. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి అతనిలో కనిపించింది. పాయింట్లు సాధించే అవకాశం లభించిన చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఆడి దానిని కాలదన్నుకున్నాడు.

ముర్రే మాత్రం ఎక్కడా తడబాటుకు లోను కాకుండా ప్రశాంతంగా ఆడాడు. చక్కటి రిటర్న్‌లతో ప్రత్యర్థికి సమాధానమిచ్చాడు. ముర్రే చేసిన 6 తప్పులతో పోలిస్తే రోనిచ్ ఏకంగా 21 అనవసర తప్పిదాలు చేయడం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. మ్యాచ్ మొత్తంలో ఒకే సారి రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే, తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. గత పది ఫైనల్స్‌లో ఫెడరర్, జొకోవిచ్‌లతోనే తలపడిన ముర్రే, ఈసారి కొత్త ఆటగాడికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
 
‘నాకు సంబంధించి ప్రతీ ఏడాది ఈ టోర్నమెంట్ ప్రత్యేకమే. ఇక్కడ కొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. బాధించే ఓటములూ ఉన్నాయి. బహుశా ఆ పరాజయాల వల్లే కావచ్చు వింబుల్డన్ టైటిల్ గెలుపు మరింత గొప్పగా కనిపిస్తోంది. ఈ ట్రోఫీని మళ్లీ చేతుల్లోకి తీసుకోవడం గర్వంగా ఉంది. క్రితంసారి గెలిచినప్పుడు అప్పటి ఒత్తిడి వల్ల నా విజయాన్ని ఆస్వాదించలేకపోయాను. ఈ సారి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను. నా కోసం వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. వింబుల్డన్ ఫైనల్ ఆడగలిగాను కానీ దేశ ప్రధానిని కావాలనే కోరిక మాత్రం నాకు లేదు. అది చాలా పెద్ద బాధ్యత’                  
- ఆండీ ముర్రే

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement