మెల్‌బోర్న్ : ఓటమితో తీవ్ర అసహనానికి గురైన జర్మని టెన్నిస్ స్టార్ నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మైదానంలోనే తన ఫ్రస్టేషన్‌ను చూపించాడు. అందరి ముందే తీవ్ర చికాకుతో టెన్నిస్ రాకెట్‌ను ఎనిమిదిసార్లు నేలకేసి కొట్టాడు. తన కన్నా ఎక్కువ ర్యాంకైన ఆరో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) చేతిలో జ్వెరెవ్ ఘోరపరాజయాన్ని చూశాడు. దీంతో తన కోపాన్ని రాకెట్‌పై ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో జ్వెరెవ్ వరుస సెట్లలో 1-6, 1-6, 6(5)-7 తేడాతో మిలోస్ రావ్‌నిచ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను కోల్పోయిన జ్వెరెవ్ మూడో సెట్‌లో గట్టి పోటీనిచ్చినప్పటికి కెనడా స్టార్ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఇక ఏటీపీ వరల్డ్ టూర్-2018 టైటిల్ నెగ్గిన జ్వెరావ్.. మరోసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకోవడంలో విఫలమయ్యాడు. 15 గ్రాండ్‌స్లామ్‌ల్లో ఈ జర్మని ఆటగాడు 14 సార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరలేకపోయాడు. ఈ ఫ్రస్టేషన్‌తోనే తన రాకెట్‌ను నెలకొసి పదేపదే కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆ సమయంలో తనకు తీవ్ర కోపం వచ్చిందని, దాన్ని అదుపులో ఉంచుకోలేక తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టానని జ్వెరెవ్ మీడియాకు తెలిపాడు. తను చాలా చెత్తగా ఆడానని, తొలి రెండు సెట్లలో తన ఆట మరి దారుణమని చెప్పుకొచ్చాడు. తన ప్రత్యర్థి తనకన్నా మెరుగైన ప్రదర్శనకనబర్చాడని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment