ఆస్టేలియా ఓపెన్-2025(Australian Open 2025) టోర్నమెంట్లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకొవిచ్(Novak Djokovic) ప్రయాణం ముగిసింది. గాయం కారణంగా శుక్రవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే అతడు వైదొలిగాడు. తద్వారా టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నిలవాలన్న జొకొవిచ్ కలకు బ్రేక్ పడింది.
కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డుస్థాయిలో ఏకంగా పది సార్లు టైటిల్ సాధించిన ఘనత జొకొవిచ్ సొంతం. కేవలం గతేడాది మాత్రమే అతడు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీ ఫైనల్‌లో ఓడిపోయాడు. అయితే, ఈసారి మాత్రం మరింత జాగ్రత్తగా అడుగులు వేసిన జొకొవిచ్‌కు గాయం రూపంలో దురదృష్టం ఎదురైంది.
అల్‌కరాజ్ అడ్డంకిని అధిగమించి
క్వార్టర్ ఫైనల్లో.. తనకు ప్రధాన అడ్డంకిగా భావించిన అల్‌కరాజ్‌తో హోరాహోరీ పోటీలో గెలుపొందిన జొకొవిచ్ సెమీస్‌కు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో జర్మన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev)తో సెమీ ఫైనల్లో తలపడ్డాడు. ఇందులో భాగంగా తొలి సెట్‌ను జ్వెరెవ్ 7-6తో గెలుచుకున్నాడు.
పోటీ నుంచి తప్పుకొంటున్నా
అయితే, ఆ వెంటనే నెట్ దగ్గరికి వెళ్లిన జొకొవిచ్ జ్వెరెవ్‌తో కరచాలనం చేసి.. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. దీంతో సెమీస్ విజేతగా నిలిచిన జ్వెరెవ్ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ జొకొవిచ్ కాలి నొప్పితో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. తాజాగా సెమీస్ మ్యాచ్‌లో బాధ భరించలేక వైదొలిగాడు.
ఈ నేపథ్యంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన కారణంగానే ఈ సెర్బియా స్టార్ గాయపడ్డాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. రిటైర్మెంట్‌కు చేరువైన 37 ఏళ్ల నొవాక్ జొకొవిచ్ తాజా గాయం వల్ల.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవకుండానే ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించడం గమనార్హం.
జొకొవిచ్‌కు చేదు అనుభవం
సెమీ ఫైనల్ బరి నుంచి తప్పించుకుని కోర్టును వీడుతున్న సమయంలో నొవాక్ జొకొవిచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ప్రేక్షకులు అతడి గాయం గురించి హేళన చేసేలా మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జ్వెరెవ్ తన ప్రత్యర్థి ఆటగాడికి మద్దతుగా నిలిచాడు.
జ్వెరెవ్ క్రీడాస్ఫూర్తి
‘‘గాయం వల్ల కోర్టును వీడిన వ్యక్తిని అవమానించేలా మాట్లాడటం సరికాదు. దయచేసి కాస్త సంయమనం పాటించండి. మీలో ప్రతి ఒక్కరు టికెట్ల కోసం డబ్బులు చెల్లించారని తెలుసు. కాబట్టి ఐదు సెట్ల మ్యాచ్‌ను చూడాలని ఆశించడం మీ హక్కు.
కానీ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసం తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి నొవాక్ జొకొవిచ్. దయచేసి అతడిని ఏరకంగానూ హేళన చేయకండి’’ అని జ్వెరెవ్ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.
చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment