రోజర్ ఫెదరర్కు షాక్
బ్రిస్బేన్: ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజరర్ ఫెదరర్ కు ఊహించిన షాక్ తగిలింది. బ్రిస్బేన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఫెదరర్ .. కెనడా ఆటగాడు మిలాస్ రాయినిక్ దాటికి తలవంచాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ఫెదరర్ 4-6, 4-6 తేడాతో రాయినిక్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో గతేడాది ఇదే టోర్నీ ఫైనల్లో ఎదురైన ఓటమికి రాయినిక్ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరోవైపు ముఖాముఖిపోరులో రాయినిక్ తన విజయాల సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఇప్పటివరకూ వీరి మధ్య 11 మ్యాచ్ లు జరగ్గా రెండింట రాయినిక్ విజయం సాధించాడు.
ఈ రోజు జరిగిన తుదిపోరులో ఆది నుంచి ఫెదరర్కు రాయినిక్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రత్యేకంగా సర్వీసుల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన రాయినిక్.. నెట్ వద్ద కూడా అంతే దూకుడుగా ఆడి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తొలి సెట్ ఐదో గేమ్ లో రెండు బ్రేక్ పాయింట్లు సాధించి ఆధిక్యం దూసుకువెళ్లిన ఫెదరర్.. ఆ తరువాత మరో రెండు పాయింట్లను సాధించడానికి తొమ్మిది గేమ్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. మరోవైపు తన సర్వీసులతో ఫెదరర్ ను తీవ్ర ఇబ్బందులు పెట్టిన రాయినిక్ పాయింట్లను చేజిక్కించుకుని తొలి సెట్ ను కైవసం చేసుకున్నాడు. అనంతరం రెండో సెట్ లో ఏడో గేమ్ వరకూ ఫెదరర్ అడ్వాంటేజ్ సాధించలేకపోవడంతో మ్యాచ్ రెండు సెట్లతోనే ముగిసింది. ఈ మ్యాచ్ మొత్తానికి ఒకే ఒక బ్రేక్ పాయింట్ ను ఎదుర్కొన్న రాయినిక్.. ఈ ఏడాది టైటిల్ తో శుభారంభం చేయాలనుకున్న ఫెదరర్ కలను వమ్ము చేశాడు.