లండన్: గత రెండు రోజుల క్రితం వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల టైటిల్ ను గెలిచిన బ్రిటన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే టాప్ ర్యాంకింగ్ పై దృష్టి పెట్టాడు. ఈ టోర్నీలో సెర్బయా స్టార్ ,ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్ లోనే నిష్క్రమించడంతో పాటు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సెమీ ఫైనల్లో ఓడిపోవడంతో టైటిల్ ను ముర్రే సునాయాసంగా గెలిచాడు. దాంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లలో మరింత పైకి ఎగబాకాడు. వింబుల్డన్ టోర్నీ ద్వారా 1280 పాయింట్లను ముర్రే తన ఖాతాలో వేసుకోగా, జొకోవిచ్ మాత్రం 1910 పాయింట్లను కోల్పోయాడు.
టోర్నీ ఆరంభానికి ముందు వింబుల్డన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన జొకోవిచ్ ఖాతాలో 16, 950 ఏటీపీ పాయింట్లు ఉండగా, ముర్రే ఖాతాలో 8, 915 పాయింట్లు ఉన్నాయి. అయితే టోర్నీ ముగిసే నాటికి ముర్రే 10, 195 పాయింట్లకు ఎగబాకగా, జోకర్ 15, 040 పాయింట్లకు పడిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య వ్యత్యాసం 4,845 పాయింట్లకు చేరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసాన్ని తదుపరి టోర్నీల్లో మరింత తగ్గిస్తానని ముర్రే అంటున్నాడు.
'నాకు నంబర్ ర్యాంకును ఆస్వాదించడమంటే ఇష్టం. దానిపైనే దృష్టిపెట్టా. ఇక నుంచి ప్రతీ ఈవెంట్ లోనూ మెరుగ్గా రాణించి దాన్ని కైవసం చేసుకునేందుకు యత్నిస్తా. అదే నా గోల్. వింబుల్డన్ అనేది నా జీవితంలో చాలా గొప్ప టోర్నమెంట్. దాన్ని రెండుసార్లు సాధించినందుకు గర్వపడుతున్నా. రాబోయే మరిన్ని గ్రాండ్ స్లామ్ లో విజయం సాధించినట్లైతే మరింతగా రాటుదేలతా. ఈ టోర్నీ మూడో రౌండ్ లో ఓటమి పాలైన జొకోవిచ్ మరింత బలంగా తిరిగివస్తాడు' అని ముర్రే తెలిపాడు.
'టాప్'పై ముర్రే గురి!
Published Tue, Jul 12 2016 6:12 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement