లండన్: వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్ జొకోవిచ్ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్) చేతిలో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బి యా) ఓడిపోయాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన పోరులో అల్‌కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్‌పై నెగ్గాడు.
2022లో యూఎస్ ఓపెన్ సాధించిన అల్‌కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న 36 ఏళ్ల జొకోవిచ్ మూడో గ్రాండ్‌స్లామ్ తుది పోరులో ఓటమితో నిరాశగా నిష్క్రమించాడు. విజేత అల్‌కరాజ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జొకో విచ్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
హోరాహోరీగా...
అంచనాలకు తగినట్లుగా జొకోవిచ్ దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. 5–0తో దూసుకుపోయాడు. అదే జోరులో తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో హోరాహోరీ సమరం సాగింది. అల్‌కరాజ్ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో జొకోవిచ్ కూడా ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సి వచ్చింది.
స్కోర్లు 4–4, 5–5, 6–6తో సమమవుతూ వచ్చాయి. టైబ్రేక్‌లో చివరకు బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో పాయింట్ నెగ్గిన అల్‌కరాజ్ సెట్‌ను గెలుచుకున్నాడు. ఈ సెట్ 85 నిమి షాలు సాగడం విశేషం. ఈ సెట్ నాలుగో గేమ్‌లో 29 షాట్‌ల ర్యాలీతో స్టేడియం హోరెత్తింది.
పట్టు కోల్పోయిన జొకో...
రెండో సెట్ గెలిచిన ఉత్సాహంలో అల్‌కరాజ్ మూడో సెట్‌లో తన జోరును కొనసాగించాడు. 3–1తో అతను ముందంజ వేశాడు. అయితే ఐదో గేమ్ ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా సాగింది. 27 నిమిషాల పాటు 13 ‘డ్యూస్’లతో సాగిన ఈ గేమ్‌లో ప్రతీ పాయింట్ కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా పోరాడారు.
ఈ గేమ్‌ను గెలుచుకొని 4–1తో ఆధిక్యంలో నిలిచిన అల్‌కరాజ్‌కు మరో రెండు గేమ్‌లు గెలుచుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఓడితే టైటిల్ కోల్పోయేస్థితిలో నాలుగో సెట్ బరిలోకి దిగిన జొకోవిచ్ తన స్థాయి ఆటను ప్రదర్శించి సెట్ సాధించాడు. నిర్ణాయక చివరి సెట్‌లో 1–1తో సమంగా నిలిచిన తర్వాత మూడో గేమ్‌లో జొకోవిచ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment