అల్‌కరాజ్‌తో జొకోవిచ్‌ ‘ఢీ’  | Novak Djokovic Carlos Alcaraz set a Wimbledon final | Sakshi
Sakshi News home page

అల్‌కరాజ్‌తో జొకోవిచ్‌ ‘ఢీ’ 

Jul 15 2023 3:55 AM | Updated on Jul 15 2023 3:55 AM

Novak Djokovic Carlos Alcaraz set a Wimbledon final  - Sakshi

లండన్‌: రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం నొవాక్‌ జొకోవిచ్‌... కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం కార్లోస్‌ అల్‌కరాజ్‌... ఆదివారం జరిగే వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) గంటా 50 నిమిషాల్లో 6–3, 6–3, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై... డిఫెండింగ్‌ చాంపియన్, రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 2 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 7–6 (7/4)తో ఆరో సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)పై విజయం సాధించారు.

జొకోవిచ్‌ తన కెరీర్‌లో 35వసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరగా... అల్‌కరాజ్‌కిది రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కానుంది. అల్‌కరాజ్‌ గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. సినెర్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ 11 ఏస్‌లు సంధించాడు. నెట్‌ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 17 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్‌ కొట్టిన జొకోవిచ్‌ ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు.

తొమ్మిదోసారి వింబుల్డన్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌ ఏడుసార్లు విజేతగా నిలిచాడు. మెద్వెదెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ నాలుగు ఏస్‌లు సంధించాడు. నెట్‌ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 28 సార్లు పాయింట్లు నెగ్గాడు. తన సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ స్పెయిన్‌ స్టార్‌ మెద్వెదెవ్‌ సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement