ఫెడరర్ శుభారంభం
సెరెనా, రద్వాన్‌స్కా ముందంజ
సోమ్‌దేవ్ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: మాజీ నంబర్‌వన్, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. మహిళల డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) కూడా ముందంజ వేశారు. పురుషుల విభాగంలో నాలుగో సీడ్ ఫెడరర్ 6-2, 6-4, 6-2తో లుకాస్ లాకో (స్లోవేకియా)పై విజయం సాధించాడు.
ఆదివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 32 ఏళ్ల స్విస్ స్టార్ గంటకు 200 కి.మీ. వేగంతో చేసే సర్వీస్‌కు ప్రత్యర్థి నిలువలేకపోయాడు. పదో సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా) 7-6 (7/5), 7-6 (7/4), 7-5తో హెర్బెర్ట్ (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గగా, ఆరోసీడ్ బెర్డిచ్ 6-3, 6-4, 6-4 పొలన్‌స్కీ (కెనడా)పై గెలిచాడు. 13వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 7-6 (7/4), 7-5, 6-2తో సహచరుడు రోజర్ వాసెలిన్‌పై నెగ్గాడు.
నల్లకలువల జోరు
మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ 6-2, 6-1తో అలిజ్ లిమ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించగా... ఆమె సోదరి వీనస్ విలియమ్స్ 6-4, 6-1తో బెన్సిక్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. మూడో సీడ్ రద్వాన్‌స్కా 6-3, 6-0తో షువాయ్ జంగ్ (చైనా)పై, స్లోవేకియా సుందరి డానియెల హంతుచోవా 2-6, 6-2, 6-4తో జాక్సిక్ (సెర్బియా)పై గెలుపొందారు.
మళ్లీ తొలిరౌండ్‌లోనే...
భారత సింగిల్స్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ వరుసగా ఈ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లోనూ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. అన్‌సీడెడ్ సోమ్‌దేవ్ 7-5, 3-6, 6-7 (4/7), 3-6తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ సోమ్‌దేవ్ మొదటి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు.