ఫైనల్ చేరిన తొలిసారే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ స్టార్
ఐదు సెట్‌ల తుది సమరంలో జ్వెరెవ్‌పై అద్భుత విజయం
కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం
రూ. 21 కోట్ల 71 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
మట్టి కోర్టులపై కొత్త యువరాజు వచ్చాడు. ఇప్పటికే పచ్చిక కోర్టులపై, హార్డ్ కోర్టులపై గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ యువతార కార్లోస్ అల్‌కరాజ్ మట్టి కోర్టులపై కూడా తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలిసారే అల్‌కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. మరోవైపు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రెండోసారీ నిరాశే ఎదురైంది.
2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్‌లలో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయిన జ్వెరెవ్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్‌కరాజ్ చేతిలో ఐదు సెట్‌ల సమరంలో పరాజయం చవిచూశాడు.
పారిస్: అంచనాలకు అనుగుణంగా ఆద్యంతం పట్టుదల కోల్పోకుండా ఆడిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం ముగిసిన టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 21 ఏళ్ల అల్‌కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు.
4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్‌కరాజ్ 6–3, 2–6, 5–7, 6–1, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌కు 24 లక్షల యూరోలు (రూ. 21 కోట్ల 71 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగిన సమరం హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌లో అల్‌కరాజ్ పైచేయి సాధించగా... రెండో సెట్‌లో జ్వెరెవ్ పుంజుకున్నాడు. మూడో సెట్‌లో ఒకదశలో జ్వెరెవ్ 2–5తో వెనుకబడ్డాడు. అయితే జ్వెరెవ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను 7–5తో సొంతం చేసుకొని టైటిల్ దిశగా అడుగు వేశాడు. కానీ నాలుగో సెట్‌లో అల్‌కరాజ్ మళ్లీ చెలరేగాడు.
జ్వెరెవ్‌కు కేవలం ఒక గేమ్ కోల్పోయి సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌లోనూ అల్‌కరాజ్ తన జోరు కొనసాగించాడు. రెండుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసి తన సర్విస్‌లను నిలబెట్టుకొని ఈ స్పెయిన్ స్టార్ విజయకేతనం ఎగురవేశాడు.
» ఓపెన్ శకంలో (1968 తర్వాత) మూడు ఉపరితలాలపై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయసు్కడిగా అల్‌కరాజ్ (21 ఏళ్లు) గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు రాఫెల్ నాదల్ (23 ఏళ్లు) పేరిట ఉంది.హార్డ్ కోర్టులపై 2022 యూఎస్ ఓపెన్ నెగ్గిన అల్‌కరాజ్, 2023లో పచ్చిక కోర్టులపై వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు.
» టెన్నిస్‌లోని మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిల్స్ సాధించిన ఏడో ప్లేయర్‌గా అల్‌కరాజ్ ఘనత వహించాడు. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాట్స్ విలాండర్ (స్వీడన్), జిమ్మీ కానర్స్ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా) గతంలో ఈ ఘనత సాధించారు.
» కెరీర్‌లో ఫైనల్ చేరిన మొదటి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా అల్‌కరాజ్ నిలిచాడు. గతంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్), స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), జాన్ బోర్గ్ (స్వీడన్), ఫెడరర్, జిమ్మీ కానర్స్, వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ ఘనత సాధించారు.
» నాదల్, సాంటానా, గిమెనో, సెర్గీ బ్రుగుయెరా, కార్లోస్ మోయా, అల్బెర్ట్ కోస్టా, కార్లోస్ ఫెరీరో తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో స్పెయిన్ ప్లేయర్‌గా అల్‌కరాజ్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment