నాలుగో సారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పోలండ్ స్టార్
ఫైనల్లో జాస్మిన్ పావ్లినిపై ఘన విజయం
పారిస్: వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఎర్ర మట్టిపై తన జోరును కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వరుసగా మూడో ఏడాది ఆమె చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–1 స్కోరుతో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ)పై ఘన విజయం సాధించింది.
2022, 2023, 2024లలో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్...అంతకు ముందు 2020లో కూడా ఇక్కడ విజేతగా ట్రోఫీని అందుకుంది. 2022 యూఎస్ ఓపెన్ కలిసి ఆమె ఖాతాలో మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో ఫైనల్ చేరిన ఐదు సార్లూ స్వియాటెక్ టైటిల్ దక్కించుకోవడం విశేషం. 2007 (జస్టిన్ హెనిన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌ను వరుసగా మూడు సార్లు గెలిచిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె నిలిచింది.
తొలి సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పావ్లిని బలమైన ప్రత్యర్థి జోరు ముందు నిలవలేకపోయింది. తొలి సెట్‌లో స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పావ్లిని 2–1తో ముందంజ వేసినా...అది అక్కడితో సరి. పోలండ్ స్టార్ ఆ తర్వాత తన స్థాయికి తగ్గట్లు చెలరేగిపోయి వరుసగా 10 గేమ్‌లను గెలుచుకుంది. ఫలితంగా తొలి సెట్‌ను గెలుచుకోవడంతో పాటు రెండో సెట్‌లోనూ 5–0తో విజయానికి చేరువైంది.
ఈ స్థితిలో తర్వాతి గేమ్‌ను ఎలాగో పావ్లిని గెలుచుకోగలిగినా...తర్వాతి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకొని స్వియాటెక్ సంబరాలు చేసుకుంది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో స్వియాటెక్ 18 విన్నర్లు కొట్టగా...18 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో పావ్లిని తన ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 24 లక్షల యూరోలు (సుమారు రూ. 22 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.
నేడు పురుషుల ఫైనల్
అల్కరాజ్ (స్పెయిన్) X జ్వెరెవ్ (జర్మనీ)
సా.గం.6.00 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment