వండర్సన్... | Third seed Andy Murray in shock | Sakshi
Sakshi News home page

వండర్సన్...

Published Wed, Sep 9 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

వండర్సన్...

వండర్సన్...

మూడో సీడ్ ఆండీ ముర్రేకు షాక్
♦ దక్షిణాఫ్రికా ప్లేయర్ అండర్సన్ సంచలనం
♦ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లోకి
♦ ఆరో సీడ్ బెర్డిచ్ కూడా ఇంటిదారి
♦ ఎదురులేని ఫెడరర్
 
 గత ఐదేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో నిలకడకు మారుపేరుగా నిలిచిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఈసారి తడబడ్డాడు. దక్షిణాఫ్రికా ఆజానుబాహుడు కెవిన్ అండర్సన్ ధాటికి ముర్రే ప్రిక్వార్టర్ ఫైనల్లో చేతులెత్తేశాడు. భారీ సర్వీస్‌లతో విరుచుకుపడిన అండర్సన్ ఆద్యంతం నిలకడగా ఆడి వండర్ ఫలితాన్ని సాధించాడు. తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

 
 న్యూయార్క్ : గొప్ప వేదికలపై గత రికార్డులు ప్రభావం చూపవని... ఆ రోజు అద్భుతంగా ఆడిన వారినే విజయం వరిస్తుందని మరోసారి రుజువైంది. 2011 నుంచి వరుసగా 18 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మూడో సీడ్ ముర్రే ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. 4 గంటల 18 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7-6 (7/5), 6-3, 6-7 (2/7), 7-6 (7/0)తో ముర్రేను మట్టికరిపించాడు.

► 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న 29 ఏళ్ల అండర్సన్ ఈ మ్యాచ్‌లో 25 ఏస్‌లు సంధించాడు. ముర్రే సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన అతను తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 57 అనవసర తప్పిదాలు చేసినా.. నిర్ణాయక టైబ్రేక్‌లలో మాత్రం అండర్సన్ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. టాప్-15 ర్యాంకుల్లోని ఆటగాడిపై నెగ్గడం అండర్సన్ కెరీర్‌లో ఇదే తొలిసారి.
► ఈ మ్యాచ్‌కు ముందు ముర్రేతో గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అండర్సన్ ఐదుసార్లు ఓడిపోయాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకే ఒక్కసారి 2010 ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో ముర్రేతో ఆడిన అండర్సన్ కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే గెలిచి ఓటమిని  మూటగట్టుకున్నాడు. అయితే తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో అండర్సన్ నిరూపించాడు. గత ఫలితాలతో సంబంధం లేకుండా ఈసారి అద్భుత విజయాన్ని దక్కించుకొని ముర్రే ఆట కట్టించాడు.
► 1992లో వేన్ ఫెరారీ తర్వాత యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో అండర్సన్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో అండర్సన్ 4-3తో ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో వావ్రింకా 6-4, 1-6, 6-3, 6-4తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై గెలుపొందాడు.

 సూపర్ ఫెడరర్
 మరోవైపు రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తన విజయపరంపర కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 7-6 (7/0), 7-6 (8/6), 7-5తో 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచాడు. 2 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ మూడో సెట్‌లోని 12వ గేమ్‌లో ఇస్నెర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి గెలిచాడు.

► 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 109 కేజీల బరువున్న ఇస్నెర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి ఓ టైబ్రేక్‌ను 0-7తో కోల్పోయాడు. ఐదుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఇస్నెర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫెడరర్ 15 ఏస్‌లు సంధించి,16 అనవసర తప్పిదాలు చేశాడు.
► క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 14-2తో ఆధిక్యంలో ఉన్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రిచర్డ్ గాస్కే 2-6, 6-3, 6-4, 6-1తో ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయాన్ని సాధించాడు.

 చెమటోడ్చి నెగ్గిన హలెప్: మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హలెప్ 6-7 (6/8), 7-5, 6-2తో 24వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను 10 సార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయింది. మహిళల టెన్నిస్‌లో వేగవంతమైన సర్వీస్, ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు సంధించిన రికార్డును కలిగిన లిసికి ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లలో అద్భుతంగా ఆడింది. అయితే కీలకమైన మూడో సెట్‌లో తడబడి మూల్యం చెల్లించుకుంది. లిసికి ఏకంగా 72 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం.

 ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 26వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-4, 6-4తో 2011 చాంపియన్, 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)ను ఓడించగా... ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 6-3తో క్వాలిఫయర్ జొహనా కొంటా (బ్రిటన్)పై గెలిచింది.
 
 మిక్స్‌డ్ సెమీస్‌లో బోపన్న జంట
 మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్) -యుంగ్ జాన్‌చాన్ ద్వయం (చైనీస్ తైపీ) 7-6 (9/7), 5-7, 13-11తో ‘సూపర్ టైబ్రేక్’లో సు వీ సెయి (చైనీస్ తైపీ)-హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్) జంటపై గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీకి సిమోనా హలెప్-హొరియా టెకావ్ (రుమేనియా) జంట నుంచి వాకోవర్ లభించింది. సెమీస్‌లో బోపన్న-యుంగ్ జాన్ చాన్‌లతో పేస్-హింగిస్ తలపడతారు.
 
 ప్రాంజల పరాజయం
 జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు తొలి రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. 15వ సీడ్ ప్రాంజల 6-7 (1/7), 3-6తో వాలెంటిని గ్రామాటికోపులూ (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement