కాలిఫోర్నియా: టైటిల్ ఫేవరెట్స్‌ను బోల్తా కొట్టిస్తూ ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో కొత్త చాంపియన్స్ అవతరించారు. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)... మహిళల సింగిల్స్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన బియాంక ఆండ్రీస్కు (కెనడా) టైటిల్స్ సొంతం చేసుకొని సంచలనం సృష్టించారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డొమినిక్ థీమ్ 3–6, 6–3, 7–5తో నాలుగో సీడ్, గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బియాంక ఆండ్రీస్కు 6–4, 3–6, 6–4తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది. చాంపియన్స్‌గా నిలిచిన థీమ్, బియాంకాలకు 13,54,010 డాలర్ల (రూ. 9 కోట్ల 29 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
22 ఏళ్ల తర్వాత...
గతంలో రెండుసార్లు మాస్టర్స్ ఫైనల్స్ (మాడ్రిడ్ ఓపెన్) ఆడి రెండుసార్లూ ఓడిపోయిన డొమినిక్ థీమ్‌కు మూడో ఫైనల్ కలిసొచ్చింది. దిగ్గజ ప్రత్యర్థి ముందున్నా... తొలి సెట్‌ను కోల్పోయినా... ఏదశలోనూ నిరాశకు లోనుకాకుండా ఆడిన థీమ్ ఆఖరికి అనుకున్న ఫలితం సాధించాడు. చెరో సెట్ గెలిచాక... నిర్ణాయక మూడో సెట్‌లోని 11వ గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన థీమ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 22 ఏళ్ల తర్వాత మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఆస్ట్రియా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా తరఫున చివరిసారి థామస్ ముస్టర్ (1997లో మయామి ఓపెన్) మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచాడు.
చాంప్స్ థీమ్, బియాంక
Published Tue, Mar 19 2019 12:38 AM | Last Updated on Tue, Mar 19 2019 12:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment