Indian Wells Title
-
Indian Wells Masters: బోపన్న కొత్త చరిత్ర...
కాలిఫోర్నియా: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ వెస్టీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్ నెస్టర్ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ వెస్లీ కూల్‌హాఫ్–నీల్ స్కప్సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 5: బోపన్న కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. గతంలో అతను మోంటెకార్లో (2017 లో), మాడ్రిడ్ (2015లో), పారిస్ ఓపెన్ (2012, 2011లో) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. 24: బోపన్న కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్లో ఎబ్డెన్తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఇండియన్ వెల్స్ టోర్నీకి టెన్నిస్ స్వర్గధామం అని పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ టోర్నీలో ఆడుతున్నాను. విజేతలెందరినో చూశాను. ఈసారి నేను చాంపియన్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. –రోహన్ బోపన్న విన్నర్స్ ట్రోఫీతో బోపన్న–ఎబ్డెన్ జోడీ -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో విశేషంగా రాణించిన భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ... సోమవారం విడుదల చేసిన ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకాడు. 97వ ర్యాంక్ నుంచి 84వ ర్యాంక్‌కు చేరుకొని కెరీర్లోనే అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. ఇండియన్ వెల్స్ టోర్నీలో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన ఈ తమిళనాడు ప్లేయర్ మూడో రౌండ్‌కు చేరి 61 ర్యాంకింగ్ పాయింట్లను సమకూర్చుకున్నాడు. ప్రజ్నేశ్ తర్వాత రామ్‌కుమార్ 139వ ర్యాంక్‌లో నిలువగా... గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న యూకీ బాంబ్రీ 36 స్థానాలు పడిపోయి 207వ ర్యాంక్‌కు చేరాడు. -
చాంప్స్ థీమ్, బియాంక
కాలిఫోర్నియా: టైటిల్ ఫేవరెట్స్‌ను బోల్తా కొట్టిస్తూ ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్స్ అవతరించారు. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)... మహిళల సింగిల్స్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన బియాంక ఆండ్రీస్కు (కెనడా) టైటిల్స్ సొంతం చేసుకొని సంచలనం సృష్టించారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డొమినిక్ థీమ్ 3–6, 6–3, 7–5తో నాలుగో సీడ్, గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బియాంక ఆండ్రీస్కు 6–4, 3–6, 6–4తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది. చాంపియన్స్‌గా నిలిచిన థీమ్, బియాంకాలకు 13,54,010 డాలర్ల (రూ. 9 కోట్ల 29 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 22 ఏళ్ల తర్వాత... గతంలో రెండుసార్లు మాస్టర్స్ ఫైనల్స్ (మాడ్రిడ్ ఓపెన్) ఆడి రెండుసార్లూ ఓడిపోయిన డొమినిక్ థీమ్‌కు మూడో ఫైనల్ కలిసొచ్చింది. దిగ్గజ ప్రత్యర్థి ముందున్నా... తొలి సెట్‌ను కోల్పోయినా... ఏదశలోనూ నిరాశకు లోనుకాకుండా ఆడిన థీమ్ ఆఖరికి అనుకున్న ఫలితం సాధించాడు. చెరో సెట్ గెలిచాక... నిర్ణాయక మూడో సెట్లోని 11వ గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన థీమ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 22 ఏళ్ల తర్వాత మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఆస్ట్రియా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా తరఫున చివరిసారి థామస్ ముస్టర్ (1997లో మయామి ఓపెన్) మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచాడు. -
ఫెడరర్ 16–0
కాలిఫోర్నియా: డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ టైటిల్ దిశగా ముందంజ వేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 7–5, 6–1తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. ఈ ఏడాది ఫెడరర్‌కిది వరుసగా 16వ విజయం కావడం విశేషం. 2006 తర్వాత ఈ స్విస్ దిగ్గజం ఓ సీజన్ ఆరంభంలో 16 వరుస విజయాలు నమోదు చేయడం ఇదే ప్రథమం. సెమీఫైనల్లో కొరిక్ (క్రొయేషియా)తో ఫెడరర్ ఆడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కొరిక్ 2–6, 6–4, 7–6 (7/3)తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. -
ఫెడరర్ జిగేల్..
కాలిఫోర్నియా:ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరోసారి జిగేల్మన్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ టైటిల్ ను ఫెడరర్ కైవసం చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం జరిగిన తుదిపోరులో ఫెడరర్ 6-4, 7-5 తేడాతో తన దేశానికే చెందిన స్టాన్ వావ్రింకాను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. ఇది ఫెడరర్ కు ఐదో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్. అంతకుముందు 2004,05,06, 12ల్లో ఈ టైటిల్ ను ఫెడరర్ దక్కించుకున్నాడు. తద్వారా ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్స్ ను అత్యధిక సార్లు గెలుచుకున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సరసన ఫెడరర్ నిలిచాడు. గతేడాది మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న ఫెడరర్ దాదాపు ఆరు నెలలు పాటు ఇంటికే పరిమితమయ్యాడు. ఆపై గాయం నుంచి కోలుకున్న ఫెడరర్.. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో బరిలో దిగి సత్తా చాటాడు. స్పెయిన్ రఫెల్ నాదల్ తో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ తుది పోరులో ఫెడరర్ పోరాడి గెలిచాడు. మరొకవైపు డబ్యూటీఏ ఇండియన్ వెల్స్ టైటిల్ ను వెలినా వెస్నియా కైవసం చేసుకుంది. తుదిపోరులో కుజ్నెత్సోవాపై గెలిచి టైటిల్ ను సాధించింది.