ఫెడరర్ జిగేల్..
కాలిఫోర్నియా:ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరోసారి జిగేల్మన్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ టైటిల్ ను ఫెడరర్ కైవసం చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం జరిగిన తుదిపోరులో ఫెడరర్ 6-4, 7-5 తేడాతో తన దేశానికే చెందిన స్టాన్ వావ్రింకాను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. ఇది ఫెడరర్ కు ఐదో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్. అంతకుముందు 2004,05,06, 12ల్లో ఈ టైటిల్ ను ఫెడరర్ దక్కించుకున్నాడు. తద్వారా ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్స్ ను అత్యధిక సార్లు గెలుచుకున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సరసన ఫెడరర్ నిలిచాడు.
గతేడాది మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న ఫెడరర్ దాదాపు ఆరు నెలలు పాటు ఇంటికే పరిమితమయ్యాడు. ఆపై గాయం నుంచి కోలుకున్న ఫెడరర్.. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో బరిలో దిగి సత్తా చాటాడు. స్పెయిన్ రఫెల్ నాదల్ తో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ తుది పోరులో ఫెడరర్ పోరాడి గెలిచాడు. మరొకవైపు డబ్యూటీఏ ఇండియన్ వెల్స్ టైటిల్ ను వెలినా వెస్నియా కైవసం చేసుకుంది. తుదిపోరులో కుజ్నెత్సోవాపై గెలిచి టైటిల్ ను సాధించింది.