Stan Wawrinka
-
ఫ్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్
పారిస్: మట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్ మరోసారి విజృంభించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో వావ్రింకాపై విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో వావ్రికాను 6-2, 6-3, 6-1 తేడాతో నాదల్ మట్టికరిపించాడు. ఈ విజయంతో 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా నాదల్ రికార్డు సృష్టించాడు. అలాగే.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాదల్ రెండోస్థానంలో నిలిచాడు. మొత్తంగా నాదల్కు ఇది 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కాగా.. ఫెదరర్ 18 గ్రాండ్‌స్లామ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. టైటిల్ గెలిచే క్రమంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన నాదల్ కేవలం 35 గేమ్‌లను మాత్రమే కోల్పోవడం గమనార్హం. -
'మళ్లీ నంబర్ వన్ కావడం ఖాయం'
మియామి: గాయం కారణంగా సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకుని ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో పునరాగమనం చేసి సత్తా చాటుకున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పై ఆ దేశానికే చెందిన మరో టెన్నిస్ ఆటగాడు స్టాన్ వావ్రింకా ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా మాస్టర్ ఫైనల్ గెలిచిన ఫెడరర్ ఆటను చూస్తుంటే అతను మరొకసారి పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించుకోవడం ఖాయంగా కనబడుతోందన్నాడు. ప్రస్తుతం ఆరో ర్యాంకులో ఉన్న ఫెడరర్.. తిరిగి నంబర్ వన్ చేరుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. 'బేస్ లైన్ దగ్గరగా ఫెడరర్ ఆడే ఆటతీరు అద్భుతం. టాప్ స్పిన్ ను ఎక్కువగా ఉపయోగించుకుంటూ ప్రత్యర్థిని ఒత్తిడిలో పెడుతున్నాడు. అదే క్రమంలో రిటర్న్ షాట్స్ ను కూడా చాలా ఈజీగా కొడుతున్నాడు. లేటు వయసులో ఆస్ట్రేలియా, మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన ఫెడరర్ మరొకసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం ఖాయం'అని వావ్రింకా పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ ను ఫెడరర్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తుదిపోరులో ఫెడరర్ 6-4, 7-5 తేడాతో వావ్రింకాను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. -
ఫెడరర్ జిగేల్..
కాలిఫోర్నియా:ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరోసారి జిగేల్మన్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ టైటిల్ ను ఫెడరర్ కైవసం చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం జరిగిన తుదిపోరులో ఫెడరర్ 6-4, 7-5 తేడాతో తన దేశానికే చెందిన స్టాన్ వావ్రింకాను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. ఇది ఫెడరర్ కు ఐదో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్. అంతకుముందు 2004,05,06, 12ల్లో ఈ టైటిల్ ను ఫెడరర్ దక్కించుకున్నాడు. తద్వారా ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్స్ ను అత్యధిక సార్లు గెలుచుకున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సరసన ఫెడరర్ నిలిచాడు. గతేడాది మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న ఫెడరర్ దాదాపు ఆరు నెలలు పాటు ఇంటికే పరిమితమయ్యాడు. ఆపై గాయం నుంచి కోలుకున్న ఫెడరర్.. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో బరిలో దిగి సత్తా చాటాడు. స్పెయిన్ రఫెల్ నాదల్ తో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ తుది పోరులో ఫెడరర్ పోరాడి గెలిచాడు. మరొకవైపు డబ్యూటీఏ ఇండియన్ వెల్స్ టైటిల్ ను వెలినా వెస్నియా కైవసం చేసుకుంది. తుదిపోరులో కుజ్నెత్సోవాపై గెలిచి టైటిల్ ను సాధించింది. -
ఫైనల్లో ఫెడరర్, వావ్రింకా
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ టైటిల్ కోసం స్విట్జర్లాండ్ స్టార్స్ రోజర్ ఫెడరర్, స్టానిస్లాస్ వావ్రింకా అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఫెడరర్ 6–1, 7–6 (7/4)తో జాక్ సాక్ (అమెరికా)పై గెలుపొందగా... వావ్రింకా 6–3, 6–2తో బుస్టా (స్పెయిన్)ను ఓడించాడు. వావ్రింకాతో ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 19–3తో ఆధిక్యంలో ఉన్నాడు. 42 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో 2001 తర్వాత (అగస్సీ, సంప్రాస్–అమెరికా) తొలిసారి ఒకే దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఫైనల్ జరగనుంది. -
ఫెడరర్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సిడ్నీ:ప్రపంచ మాజీ నంబర్ వన్, స్విస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ గ్రాండ్ స్లామ్ లో ఆద్యంతం జోరును కొనసాగించిన ఫెడరర్.. గురువారం జరిగిన పురుషుల సెమీస్‌లో మరో స్విస్ ఆటగాడు స్టాన్ వావ్రింకాపై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించాడు. ఇరువురు మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ 7-5, 6-3, 1-6, 4-6, 6-3 తేడాతో వావ్రింకాపై గెలిచి ఫైనల్‌కు చేరాడు. తొలి రెండు సెట్లను గెలిచిన ఫెడరర్.. ఆ తరువాత మూడు, నాలుగు సెట్లను కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మక ఐదో సెట్లో తన అనుభవాన్ని ఉపయోగించిన ఫెడరర్ ఆ సెట్ ను సునాయాసంగా కైవసం చేసుకుని ఫైనల్లోకి ప్రవేశించాడు. 2015 యూఎస్ ఓపెన్ ఫైనల్ తరువాత ఇది ఫెడరర్ కు తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్. అప్పుడు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓటమి పాలైన ఫెడరర్.. గతేడాది పెద్దగా ఆకట్టుకోలేదు. 2017 ఆరంభపు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను సాధించాలనే పట్టుదలగా ఉన్నాడు. అతనికి ఫైనల్లో స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ కానీ, బల్గేరియా ఆటగాడు దిమిత్రోవ్ కానీ ఎదురుకావొచ్చు. -
సెమీస్‌లో వావ్రింకా
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో మాజీ చాంపియన్ స్టాన్ వావ్రింకా సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ ఫోరులో వావ్రింకా 7-6(2), 6-4, 6-3 తేడాతో సోంగాపై విజయం సాధించి సెమీస్‌కు చేరాడు. రెండు గంటల 15 నిమిషాల పాటు జరిగిన పోరులో వావ్రింకా వరుస సెట్లను కైవసం చేసుకుని మరోసారి టైటిల్ ను కైవసం చేసుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. 2014లో ఆస్ట్రేలియా ఓపెన్ లో వావ్రింకా చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఇరు వురి మధ్య హోరాహెరీ పోరుకు తెరలేచింది. ప్రధానంగా టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్లో ఇద్దరు క్రీడాకారులు రసవత్తర పోరును తలపించారు. ఆ క్రమంలోనే ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే ఇక్కడ సోంగాను మైండ్ గేమ్‌తో పక్కదోవ పట్టించిన వావ్రింకా.. తొలి సెట్‌ను సొంతం చేసుకుని పైచేయి సాధించాడు. అనంతరం జరిగిన రెండు సెట్లలో వావ్రింకా పెద్దగా కష్టపడకుండానే గెలిచి సెమీస్ లోకి ప్రవేశించాడు. -
ఫెదరర్‌కు అంత ఈజీ కాదు..
షాంఘై:ఇటీవల కాలంలో తరచు గాయాల బారిన పడుతూ పలు ప్రధాన టోర్నీలకు దూరమైన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదని అంటున్నాడు అతని దేశానికే చెందిన స్టాన్ వావ్రింకా. ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న ఫెదరర్.. మరోసారి టాప్ -4లో నిలవాలంటే తీవ్రంగా శ్రమించకతప్పదని వావ్రింకా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఫెదరర్ అతి పెద్ద గాయంతో సతమవుతుండటంతో అతని టెన్నిస్ పునరాగమనం ఆశాజనకంగా ఉండకపోవచ్చన్నాడు. 'ప్రస్తుతం ఫెదరర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడని అనుకుంటున్నా. అయితే తిరిగి అతను పూర్వవైభవాన్ని అందిపుచ్చుకుంటాడో? లేదో? కచ్చితంగా చెప్పలేను. ఏమి జరుగుతందని కాలమే చెబుతుంది. కాకపోతే ఫెదరర్ మోకాలి గాయం తీవ్రమైనది. ఆ గాయం నుంచి తేరుకుని ఫెదరర్ వచ్చినా మళ్లి సత్తాచాటడం అంత తేలిక కాదు. ఒకవేళ ఫెదరర్ 100 శాతం ఫిట్ నెస్ తో ఉంటే మాత్రం ప్రత్యర్థలకు అతను ఓ ప్రమాదకారి ప్లేయర్' అని వావ్రింకా తెలిపాడు. గాయం కారణంగా ఈ ఏడాది జూలై నుంచి ఫెదరర్ ఏ టెన్నిస్ ఈవెంట్ లోనూ పాల్గొనలేదు. అంతకుముందు గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా ఓపెన్ లో బరిలోకి దిగి సెమీస్ లో నిష్ర్కమించిన ఫెదరర్.. ఆ తరువాత ఫ్రెంచ్ ఓపెన్ కు దూరంగా ఉన్నాడు. కాగా, తిరిగి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో ఆడినా సెమీస్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. నాలుగేళ్లుగా గ్రాండ్ స్లామ్ సాధించడంలో ఫెదరర్ విఫలమవుతున్నాడు. -
జొకోవిచ్ మరోసారి..
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరోసారి టైటిల్ వేటకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ పోరులో జొకోవిచ్ 6-3,6-2, 3-6, 6-2 తేడాతో గేల్ మోన్ఫిల్స్పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రెండు సెట్లను అవలీలగా గెలిచి మంచి ఊపుమీద కనిపించిన జొకోవిచ్.. మూడో సెట్‌ను కోల్పోయాడు. ఈ సెట్లో మోన్ఫిల్స్ పదునైన సర్వీసులతో రాణించి ఆ సెట్ ను దక్కించుకున్నాడు. ఆ తరువాత కీలకమైన నాల్గో సెట్లో తిరిగి పుంజుకున్న జొకోవిచ్ ఎటువంటి తప్పిదాలు చేయకుండా మోన్ఫిల్స్ను కంగుతినింపించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. మరో్ పురుషుల సెమీ ఫైనల్లో వావ్రింకా 4-6-7-5, 6-4, 6-2 తేడాతో జపాన్ స్టార్ కీ నిషికోరిపై గెలిచి ఫైనల్లోకి చేరాడు. తొలి సెట్‌ను కోల్పోయిన వావ్రింకా.. ఆ తరువాత వరుస మూడు సెట్లను గెలిచి తుది సమరానికి అర్హత సాధించాడు. సోమవారం జొకోవిచ్- వావ్రింకాల మధ్య అంతిమసమరం జరుగునుంది. వీరిద్దరి ముఖాముఖి పోరులో జొకోవిచ్ 19-4తో ముందంజలో ఉన్నాడు. అయితే గతేడాది ఫ్రెంచ్ ఫైనల్లో జొకోవిచ్‌కు వావ్రింకా షాకిచ్చాడు. దీంతో మరోసారి వీరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. యూఎస్ పోరుపై వావ్రింకా స్పందిస్తూ.. మరోసారి జొకోవిచ్పై పైచేయి సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే జొకోవిచ్ మాత్రం తన ఫైనల్ పోరు చాలా ప్రత్యేకమని పేర్కొన్నాడు. 2011లో తొలిసారి యూఎస్ ఓపెన్ సాధించిన జోకోవిచ్.. చివరిసారి 2015లో మాత్రమే ఆ టైటిల్‌ను సాధించాడు. గత సంవత్సరం యూఎస్ ఓపెన్‌ను సాధించడంతో 10వ గ్రాండ్ స్లామ్ టైటిల్ జొకోవిచ్ ఖాతాలో చేరింది. ఇప్పటివరకూ 12 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ జొకోవిచ్ కైవసం చేసుకున్నాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ ను సాధించిన జొకోవిచ్.. మూడు సార్లు వింబుల్డన్ టైటిల్స్ ను, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. -
'రియో నుంచి తప్పుకుంటున్నాను'
రియోడిజనీరో: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటేనే టెన్నిస్ స్టార్టు గజగజ వణికిపోతున్నారు. కారణం.. బ్రెజిల్లో వెలుగు చూసిన జికా వైరస్. ఈ కారణంగా రియోలో ప్రాతినిధ్యం వహించడం ఇష్టం లేక, ఇతరత్రా కారణాలను సాకుగా చూపి ఒలింపిక్స్ నుంచి టాప్ ఆటగాళ్లు ఒక్కక్కరుగా తప్పుకుంటున్నారు. తాజాగా స్విట్జర్లాండ్ సంచలనం, ప్రపంచ నాల్గవ ర్యాంక్ ఆటగాడు స్టాన్ వావ్రింకా తన దేశానికే చెందిన దిగ్గజం రోజర్ ఫెదరర్ బాటలో నడుస్తున్నాడు. గాయం కారణంగా తాను రియో రేసు నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు. దీంతో రియో నుంచి తప్పుకున్న మూడో స్విస్ ప్లేయర్ అయ్యాడు. ఫెదరర్, బెలిండా బెన్సిక్ ఇప్పటికే రియోలో పాల్గొనడం లేదని ప్రకటించేశారు. నేను చాలా బాధపడుతున్నాను. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ తర్వాత మూడో ఒలింపిక్స్ లో ఆడతానని భావించాను. అయితే అది సాధ్యం కావడం లేదు. రియోలో పాల్గొంటున్న స్విస్ ఆటగాళ్లు ఆల్ ది బెస్ట్. వారికి నా పూర్తి మద్ధతు తెలుపుతున్నాను' అని వావ్రింకా పేర్కొన్నాడు. గాయాలతో ఉన్నా టొరంటో మాస్టర్స్ లో పాల్గొని వావ్రింకా సెమీస్ కూడా చేరాడు. కానీ, ఇంతలోనే తన నిర్ణయాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపోయేలా చేశాడు. వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్లతో పాటు, ఫెదరర్, బెలిండా బెన్సిక్, చెక్ రిపబ్లిక్కు చెందిన వరల్డ్ ఎనిమిదో ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు టామస్ బెర్డిచ్, అదే దేశానికి చెందిన కరోలినా ప్లిస్కోవా, డబుల్స్ సంచలనాలు మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ లు, ఇతర కీలక ప్లేయర్స్ ఇప్పటికే రియో నుంచి వైదొలిగారు. -
'స్టార్ ప్లేయర్ అందరికీ షాకిచ్చాడు'
జెనీవా: మాజీ ప్రపంచ నంబర్ వన్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ లో ఆడకపోవడం తనను బాధతో పాటు భయానికి గురి చేసిందని వావ్రింకా అంటున్నాడు. ఈ ఆదివారం నుంచి ఆరంభం కానున్న ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని అందుకు మేజర్ టోర్నీలో పాల్గొనడం లేదని పోస్ట్ లో పేర్కొన్నాడు. 2009లో ఫ్రెంచ్ ఓపెన్ ను సొంతం చేసుకున్న ఫెదరర్ 17 మేజర్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్విట్జర్లాండ్ కే చెందిన సహచర ఆటగాడు వావ్రింకా చాలా కాలం రోజర్ తో కలిసి టోర్నీల్లో పాల్గొన్నాడు. ఈ స్విస్ జోడీ ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో స్వర్ణాన్ని, 2014లో డేవిస్ కప్ లోనూ బంగారు పతకాన్ని సాధించారు. 1999 తర్వాత తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ కు ఫెదరర్ దూరమవడం ఇదే ప్రథమం. చివరిసారిగా ఆ ఏడాది జరిగిన యూఎస్ గ్రాండ్ స్లామ్ నుంచి తప్పుకున్నాడు. 65 మేజర్ టోర్నీల తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి వైదొలిగి ఫెదరర్ తన అభిమానులకు, సహచరుడు వావ్రింకాకు భారీ షాక్ ఇచ్చాడు. ఫెదరర్ నిర్ణయంతో తాను చాలా బాధపడ్డానని, అతని నిర్ణయంతో భయాందోళనకు కూడా గురయ్యానని వావ్రింకా చెప్పుకొచ్చాడు. -
మూడో రౌండ్లోకి వావ్రింకా
మెల్ బోర్న్: సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ప్రపంచ నాల్గో ర్యాంకు ఆటగాడు స్టాన్ వావ్రింకా(స్విట్జర్లాండ్) మూడో రౌండ్ లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో వావ్రింకా 6-2, 6-3, 6-4 తేడాతో రాడెక్ స్టెపెనెక్(చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి మూడో రౌండ్ కు చేరుకున్నాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా రెండు గంటల పాటు సాగిన మ్యాచ్ లో వావ్రింకా ముందు స్టెపెనెక్ నిలబడలేకపోయాడు. ప్రత్యేకంగా నిర్ణయాత్మక మూడో సెట్ లో వీరి మధ్య అనేక మార్లు బ్రేక్ పాయింట్లు పరస్పరం దోబుచులాడినా చివరకు వావ్రింకానే పైచేయి సాధించి తదుపరి పోరుకు సిద్ధమయ్యాడు. -
చెన్నై ఓపెన్ సెంటిమెంట్!
స్విట్జర్లాండ్: వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే చెన్నై ఓపెన్ కు స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచ నాల్గో నంబర్ ఆటగాడు స్టాన్ వావ్రింకా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే మూడు చెన్నై సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన వావ్రింకా.. వచ్చే సంవత్సరం గ్రాండ్ స్లామ్ టోర్నీలకు ముందు జరిగే చెన్నై ఓపెన్ తోనే తన టైటిల్ వేటను మొదలు పెడతానని అంటున్నాడు. 2015 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను, 2014 లో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలుచుకున్న వావ్రింకా.. చెన్నై ఓపెన్ ను కాస్త సెంటిమెంట్ గా భావిస్తున్నాడు. వరుసగా ఆయా సంవత్సరాల్లో చెన్నై ఓపెన్ ను గెలిచిన అనంతరమే ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్లు గెలిచినట్లు తెలిపాడు. దీనిలోభాగంగా చెన్నై ఓపెన్ కు ఎనిమిదోసారి సిద్ధమవుతున్న తాను తప్పకుండా టైటిల్ ను నిలబెట్టుకుంటానని తెలిపాడు. 'వచ్చే ఏడాది సీజన్ ను ఘనంగా ఆరంభించడానికి చెన్నై ఓపెన్ ను వేదికగా చేసుకుంటా. గడిచిన రెండు సంవత్సరాలు చెన్నై ఓపెన్ నాకో ప్రత్యేకతను ఇచ్చింది. చెన్నై ఓపెన్ తో మరోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా' అని వావ్రింకా తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతున్న తాను తిరిగి టైటిల్ ను నిలబెట్టుకుంటానని పేర్కొన్నాడు.వావ్రింకా 2011,14, 15 సంవత్సరాల్లో చెన్నై ఓపెన్ ను టైటిళ్లను గెలవగా, 2010వ సంవత్సరంలో రన్నరప్ గా నిలిచాడు.