ఫెడరర్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సిడ్నీ:ప్రపంచ మాజీ నంబర్ వన్, స్విస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ గ్రాండ్ స్లామ్ లో ఆద్యంతం జోరును కొనసాగించిన ఫెడరర్.. గురువారం జరిగిన పురుషుల సెమీస్లో మరో స్విస్ ఆటగాడు స్టాన్ వావ్రింకాపై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించాడు. ఇరువురు మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ 7-5, 6-3, 1-6, 4-6, 6-3 తేడాతో వావ్రింకాపై గెలిచి ఫైనల్కు చేరాడు. తొలి రెండు సెట్లను గెలిచిన ఫెడరర్.. ఆ తరువాత మూడు, నాలుగు సెట్లను కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మక ఐదో సెట్లో తన అనుభవాన్ని ఉపయోగించిన ఫెడరర్ ఆ సెట్ ను సునాయాసంగా కైవసం చేసుకుని ఫైనల్లోకి ప్రవేశించాడు.
2015 యూఎస్ ఓపెన్ ఫైనల్ తరువాత ఇది ఫెడరర్ కు తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్. అప్పుడు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓటమి పాలైన ఫెడరర్.. గతేడాది పెద్దగా ఆకట్టుకోలేదు. 2017 ఆరంభపు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను సాధించాలనే పట్టుదలగా ఉన్నాడు. అతనికి ఫైనల్లో స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ కానీ, బల్గేరియా ఆటగాడు దిమిత్రోవ్ కానీ ఎదురుకావొచ్చు.