చెన్నై ఓపెన్ సెంటిమెంట్!
స్విట్జర్లాండ్: వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే చెన్నై ఓపెన్ కు స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచ నాల్గో నంబర్ ఆటగాడు స్టాన్ వావ్రింకా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే మూడు చెన్నై సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన వావ్రింకా.. వచ్చే సంవత్సరం గ్రాండ్ స్లామ్ టోర్నీలకు ముందు జరిగే చెన్నై ఓపెన్ తోనే తన టైటిల్ వేటను మొదలు పెడతానని అంటున్నాడు. 2015 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను, 2014 లో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలుచుకున్న వావ్రింకా.. చెన్నై ఓపెన్ ను కాస్త సెంటిమెంట్ గా భావిస్తున్నాడు. వరుసగా ఆయా సంవత్సరాల్లో చెన్నై ఓపెన్ ను గెలిచిన అనంతరమే ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్లు గెలిచినట్లు తెలిపాడు. దీనిలోభాగంగా చెన్నై ఓపెన్ కు ఎనిమిదోసారి సిద్ధమవుతున్న తాను తప్పకుండా టైటిల్ ను నిలబెట్టుకుంటానని తెలిపాడు.
'వచ్చే ఏడాది సీజన్ ను ఘనంగా ఆరంభించడానికి చెన్నై ఓపెన్ ను వేదికగా చేసుకుంటా. గడిచిన రెండు సంవత్సరాలు చెన్నై ఓపెన్ నాకో ప్రత్యేకతను ఇచ్చింది. చెన్నై ఓపెన్ తో మరోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా' అని వావ్రింకా తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతున్న తాను తిరిగి టైటిల్ ను నిలబెట్టుకుంటానని పేర్కొన్నాడు.వావ్రింకా 2011,14, 15 సంవత్సరాల్లో చెన్నై ఓపెన్ ను టైటిళ్లను గెలవగా, 2010వ సంవత్సరంలో రన్నరప్ గా నిలిచాడు.