జొకోవిచ్ మరోసారి..
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరోసారి టైటిల్ వేటకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ పోరులో జొకోవిచ్ 6-3,6-2, 3-6, 6-2 తేడాతో గేల్ మోన్ఫిల్స్పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రెండు సెట్లను అవలీలగా గెలిచి మంచి ఊపుమీద కనిపించిన జొకోవిచ్.. మూడో సెట్ను కోల్పోయాడు.
ఈ సెట్లో మోన్ఫిల్స్ పదునైన సర్వీసులతో రాణించి ఆ సెట్ ను దక్కించుకున్నాడు. ఆ తరువాత కీలకమైన నాల్గో సెట్లో తిరిగి పుంజుకున్న జొకోవిచ్ ఎటువంటి తప్పిదాలు చేయకుండా మోన్ఫిల్స్ను కంగుతినింపించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. మరో్ పురుషుల సెమీ ఫైనల్లో వావ్రింకా 4-6-7-5, 6-4, 6-2 తేడాతో జపాన్ స్టార్ కీ నిషికోరిపై గెలిచి ఫైనల్లోకి చేరాడు. తొలి సెట్ను కోల్పోయిన వావ్రింకా.. ఆ తరువాత వరుస మూడు సెట్లను గెలిచి తుది సమరానికి అర్హత సాధించాడు. సోమవారం జొకోవిచ్- వావ్రింకాల మధ్య అంతిమసమరం జరుగునుంది. వీరిద్దరి ముఖాముఖి పోరులో జొకోవిచ్ 19-4తో ముందంజలో ఉన్నాడు. అయితే గతేడాది ఫ్రెంచ్ ఫైనల్లో జొకోవిచ్కు వావ్రింకా షాకిచ్చాడు. దీంతో మరోసారి వీరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.
యూఎస్ పోరుపై వావ్రింకా స్పందిస్తూ.. మరోసారి జొకోవిచ్పై పైచేయి సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే జొకోవిచ్ మాత్రం తన ఫైనల్ పోరు చాలా ప్రత్యేకమని పేర్కొన్నాడు. 2011లో తొలిసారి యూఎస్ ఓపెన్ సాధించిన జోకోవిచ్.. చివరిసారి 2015లో మాత్రమే ఆ టైటిల్ను సాధించాడు. గత సంవత్సరం యూఎస్ ఓపెన్ను సాధించడంతో 10వ గ్రాండ్ స్లామ్ టైటిల్ జొకోవిచ్ ఖాతాలో చేరింది. ఇప్పటివరకూ 12 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ జొకోవిచ్ కైవసం చేసుకున్నాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ ను సాధించిన జొకోవిచ్.. మూడు సార్లు వింబుల్డన్ టైటిల్స్ ను, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్ను గెలుచుకున్నాడు.