'స్టార్ ప్లేయర్ అందరికీ షాకిచ్చాడు'
జెనీవా: మాజీ ప్రపంచ నంబర్ వన్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ లో ఆడకపోవడం తనను బాధతో పాటు భయానికి గురి చేసిందని వావ్రింకా అంటున్నాడు. ఈ ఆదివారం నుంచి ఆరంభం కానున్న ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని అందుకు మేజర్ టోర్నీలో పాల్గొనడం లేదని పోస్ట్ లో పేర్కొన్నాడు. 2009లో ఫ్రెంచ్ ఓపెన్ ను సొంతం చేసుకున్న ఫెదరర్ 17 మేజర్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్విట్జర్లాండ్ కే చెందిన సహచర ఆటగాడు వావ్రింకా చాలా కాలం రోజర్ తో కలిసి టోర్నీల్లో పాల్గొన్నాడు.
ఈ స్విస్ జోడీ ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో స్వర్ణాన్ని, 2014లో డేవిస్ కప్ లోనూ బంగారు పతకాన్ని సాధించారు. 1999 తర్వాత తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ కు ఫెదరర్ దూరమవడం ఇదే ప్రథమం. చివరిసారిగా ఆ ఏడాది జరిగిన యూఎస్ గ్రాండ్ స్లామ్ నుంచి తప్పుకున్నాడు. 65 మేజర్ టోర్నీల తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి వైదొలిగి ఫెదరర్ తన అభిమానులకు, సహచరుడు వావ్రింకాకు భారీ షాక్ ఇచ్చాడు. ఫెదరర్ నిర్ణయంతో తాను చాలా బాధపడ్డానని, అతని నిర్ణయంతో భయాందోళనకు కూడా గురయ్యానని వావ్రింకా చెప్పుకొచ్చాడు.