ఫెదరర్కు అంత ఈజీ కాదు..
షాంఘై:ఇటీవల కాలంలో తరచు గాయాల బారిన పడుతూ పలు ప్రధాన టోర్నీలకు దూరమైన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదని అంటున్నాడు అతని దేశానికే చెందిన స్టాన్ వావ్రింకా. ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న ఫెదరర్.. మరోసారి టాప్ -4లో నిలవాలంటే తీవ్రంగా శ్రమించకతప్పదని వావ్రింకా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఫెదరర్ అతి పెద్ద గాయంతో సతమవుతుండటంతో అతని టెన్నిస్ పునరాగమనం ఆశాజనకంగా ఉండకపోవచ్చన్నాడు.
'ప్రస్తుతం ఫెదరర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడని అనుకుంటున్నా. అయితే తిరిగి అతను పూర్వవైభవాన్ని అందిపుచ్చుకుంటాడో? లేదో? కచ్చితంగా చెప్పలేను. ఏమి జరుగుతందని కాలమే చెబుతుంది. కాకపోతే ఫెదరర్ మోకాలి గాయం తీవ్రమైనది. ఆ గాయం నుంచి తేరుకుని ఫెదరర్ వచ్చినా మళ్లి సత్తాచాటడం అంత తేలిక కాదు. ఒకవేళ ఫెదరర్ 100 శాతం ఫిట్ నెస్ తో ఉంటే మాత్రం ప్రత్యర్థలకు అతను ఓ ప్రమాదకారి ప్లేయర్' అని వావ్రింకా తెలిపాడు. గాయం కారణంగా ఈ ఏడాది జూలై నుంచి ఫెదరర్ ఏ టెన్నిస్ ఈవెంట్ లోనూ పాల్గొనలేదు. అంతకుముందు గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా ఓపెన్ లో బరిలోకి దిగి సెమీస్ లో నిష్ర్కమించిన ఫెదరర్.. ఆ తరువాత ఫ్రెంచ్ ఓపెన్ కు దూరంగా ఉన్నాడు. కాగా, తిరిగి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో ఆడినా సెమీస్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. నాలుగేళ్లుగా గ్రాండ్ స్లామ్ సాధించడంలో ఫెదరర్ విఫలమవుతున్నాడు.