'రియో నుంచి తప్పుకుంటున్నాను'
రియోడిజనీరో: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటేనే టెన్నిస్ స్టార్టు గజగజ వణికిపోతున్నారు. కారణం.. బ్రెజిల్లో వెలుగు చూసిన జికా వైరస్. ఈ కారణంగా రియోలో ప్రాతినిధ్యం వహించడం ఇష్టం లేక, ఇతరత్రా కారణాలను సాకుగా చూపి ఒలింపిక్స్ నుంచి టాప్ ఆటగాళ్లు ఒక్కక్కరుగా తప్పుకుంటున్నారు. తాజాగా స్విట్జర్లాండ్ సంచలనం, ప్రపంచ నాల్గవ ర్యాంక్ ఆటగాడు స్టాన్ వావ్రింకా తన దేశానికే చెందిన దిగ్గజం రోజర్ ఫెదరర్ బాటలో నడుస్తున్నాడు.
గాయం కారణంగా తాను రియో రేసు నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు. దీంతో రియో నుంచి తప్పుకున్న మూడో స్విస్ ప్లేయర్ అయ్యాడు. ఫెదరర్, బెలిండా బెన్సిక్ ఇప్పటికే రియోలో పాల్గొనడం లేదని ప్రకటించేశారు. నేను చాలా బాధపడుతున్నాను. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ తర్వాత మూడో ఒలింపిక్స్ లో ఆడతానని భావించాను. అయితే అది సాధ్యం కావడం లేదు. రియోలో పాల్గొంటున్న స్విస్ ఆటగాళ్లు ఆల్ ది బెస్ట్. వారికి నా పూర్తి మద్ధతు తెలుపుతున్నాను' అని వావ్రింకా పేర్కొన్నాడు.
గాయాలతో ఉన్నా టొరంటో మాస్టర్స్ లో పాల్గొని వావ్రింకా సెమీస్ కూడా చేరాడు. కానీ, ఇంతలోనే తన నిర్ణయాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపోయేలా చేశాడు. వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్లతో పాటు, ఫెదరర్, బెలిండా బెన్సిక్, చెక్ రిపబ్లిక్కు చెందిన వరల్డ్ ఎనిమిదో ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు టామస్ బెర్డిచ్, అదే దేశానికి చెందిన కరోలినా ప్లిస్కోవా, డబుల్స్ సంచలనాలు మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ లు, ఇతర కీలక ప్లేయర్స్ ఇప్పటికే రియో నుంచి వైదొలిగారు.