సరి లేరు 'సెరెనా' కెవ్వరూ!
►గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా రికార్డు
►308 విజయాలతో అగ్రస్థానంలోకి ఫెడరర్‌ను దాటిన అమెరికన్ స్టార్
ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరో అద్భుతం చేసింది. ఓపెన్ శకంలో (1968 నుంచి) గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 307 విజయాలతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును సెరెనా 308వ విజయంతో బద్దలు కొట్టింది. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి రికార్డుస్థారుులో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది.
న్యూయార్క్: కొత్త మ్యాచ్... కొత్త ప్రత్యర్థి.. అరుునా ఫలితంలో మార్పు లేదు. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ జోరులో పదును తగ్గలేదు. రికార్డుస్థారుులో 23వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 6-2, 6-3తో యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)పై గెలిచింది. కేవలం 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా 11 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ష్వెదోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన ఈ అమెరికన్ స్టార్ ప్రత్యర్థికి ఒక్కసారి కూడా బ్రేక్ పారుుంట్ అవకాశం ఇవ్వలేదు. అంతేకాకుండా నెట్‌వద్దకు 14 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పారుుంట్లు నెగ్గి పైచేరుు సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిమోనా హాలెప్ (రొమేనియా)తో సెరెనా అమీతుమీ తేల్చుకుంటుంది. గత తొమ్మిదేళ్లలో సెరెనా యూఎస్ ఓపెన్‌లో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం: గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో ఎవరికీ సాధ్యంకాని విజయాల రికార్డును సాధించిన సెరెనా ‘గ్రాండ్’ ప్రస్థానం 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మొదలైంది. ఆ ఏడాది జనవరి 19న జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా 6-7 (5/7), 6-3, 6-1తో ఇరీనా స్పిర్లియా (రొమేనియా)పై గెలిచి తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని నమోదు చేసింది. అరుుతే తర్వాతి మ్యాచ్‌లోనే సెరెనాకు తన అక్క వీనస్ చేతిలో పరాజయం ఎదురుకావడం గమనార్హం. గత 18 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన సెరెనా పలు రికార్డులను తిరగరాసి ఇప్పటికీ తన కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తోంది.
వీనస్‌కు ప్లిస్కోవా షాక్: ఒకవైపు చెల్లెలు సెరెనా ‘గ్రాండ్’ రికార్డు విజయం నమోదు చేయగా... మరోవైపు అక్క వీనస్ విలియమ్స్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ వీనస్ 6-4, 4-6, 6-7 (3/7)తో ఓడిపోరుుంది. ప్లిస్కోవా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్)కు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. అన్‌సీడెడ్ అనా కొంజు (క్రొయేషియా) 6-4, 6-4తో రద్వాన్‌స్కాపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ సిమోనా హాలెప్ (రొమేనియా) 6-2, 7-5తో 11వ సీడ్ కార్లా నవారో (స్పెరుున్) పై గెలిచింది.
సెమీస్‌లో కెర్బర్
మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గతేడాది రన్నరప్, ఏడో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ)తో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కెర్బర్ 7-5, 6-0తో గెలిచింది. యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి చేరడం కెర్బర్‌కిది రెండోసారి.
‘మరిన్ని విజయాలు సాధిస్తా’
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ రికార్డు ఎవరి పేరు మీద నిలుస్తుందో వేచి చూడాలని సెరెనా అంటోంది. ‘నాకై తే తెలియదు. వేచి చూద్దాం. నాతోపాటు ఫెడరర్‌కు కూడా ఈ అవకాశం ఉంది. నేను ఓ ప్రణాళికతో ముందుకు సాగుతాను. ఫెడరర్ కూడా అలాగే చేస్తాడేమో’ అని సెరెనా వ్యాఖ్యానించింది. గత ఆగస్టులో ఫెడరర్ 35 ఏళ్లు పూర్తి చేసుకోగా... ఈనెల 26న సెరెనాకు 35 ఏళ్లు నిండుతారుు. ‘నా వరకై తే 308 సంఖ్య చాలా గొప్పది. ఇంతకాలంపాటు టెన్నిస్ ఆడతానని ఊహించలేదు. ఇంత నిలకడగా ఆడుతున్నందుకు గర్వంగా అనిపిస్తోంది. నా ఆటను ఎప్పుడు నిలిపేస్తానో కచ్చితంగా చెప్పలేను. ఈ క్షణాలను నేనెంతగానో ఆస్వాదిస్తున్నాను’ అని సెరెనా తెలిపింది.