జొకో జోరు.. సానియా హోరు.. సెరెనా హుషారు.. | Novak Djokovic beats Roger Federer | Sakshi
Sakshi News home page

జొకో జోరు.. సానియా హోరు.. సెరెనా హుషారు..

Published Fri, Jan 29 2016 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

జొకో జోరు.. సానియా హోరు.. సెరెనా హుషారు..

జొకో జోరు.. సానియా హోరు.. సెరెనా హుషారు..

♦ వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో జొకోవిచ్
♦ సెమీస్‌లో ఫెడరర్‌పై గెలుపు
♦ మిక్స్‌డ్ సెమీస్‌లో భారత స్టార్
♦ 26వసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అమెరికా స్టార్


మెల్‌బోర్న్: మేటి ప్రత్యర్థి ఎదురైనా... అద్వితీయమైన ఆటతీరుతో చెలరేగిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)... ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఈ టాప్‌సీడ్ ఆటగాడు 6-1, 6-2, 3-6, 6-3తో మూడోసీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలిచాడు. తాజా విజయంతో ముఖాముఖి రికార్డును 23-22తో మెరుగుపర్చుకోగా, వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం విశేషం.

రెండు గంటలా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్... 17సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఫెడరర్ షాట్లకు కచ్చితమైన సమాధానం ఇచ్చాడు. 54 నిమిషాలలో ముగిసిన తొలి రెండు సెట్లలో కేవలం మూడు గేమ్స్ మాత్రమే చేజార్చుకున్నాడు. ఫెడరర్ ఫస్ట్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెర్బియన్ తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకుని 3-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆరో గేమ్‌లో కూడా ఫోర్‌హ్యాండ్‌తో ఫ్రెడ్డీ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా తొలి 14 పాయింట్లలో 12 గెలిచాడు. ఫెడరర్‌పై తొలి సెట్‌ను ఇంత సులభంగా గెలవడం జొకొవిచ్‌కు ఇదే మొదటిసారి. ఇక రెండో సెట్‌లోనూ మూడు, ఐదో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో జొకోవిచ్‌కు ఆధిక్యం లభించింది.

మూడోసెట్‌లో దూకుడును చూపెట్టిన ఫెడరర్... ఆరో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను తొలిసారి బ్రేక్ చేశాడు. తర్వాత అదే ఒత్తిడిని కొనసాగిస్తూ... మూడోసెట్ పాయింట్‌తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. వర్షం పడే సూచనలు కనిపించడంతో స్టేడియం రూ్‌ఫ్‌ను మూసేవరకు ఇద్దరు ఆటగాళ్లు కాసేపు సేదతీరారు. ఇక నాలుగో సెట్‌లో అద్భుతమైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో చెలరేగిన జొకోవిచ్ ఎనిమిదో గేమ్‌లో పదునైన ఫోర్‌హ్యాండ్ రిటర్న్‌తో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో ఇది ఐదోసారి. తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా సెట్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు.

 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత స్టార్ సానియా మీర్జా జైత్రయాత్ర కొనసాగుతోంది. క్రొయేషియా భాగస్వామి ఇవాన్ డోడిగ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-డోడిగ్ 7-6 (7/1), 6-3తో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)పై నెగ్గారు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో సానియా ద్వయం కాస్త తడబడింది. పేస్-హింగిస్‌ల సర్వీస్‌లను అడ్డుకునే ప్రయత్నంలో అనవసర తప్పిదాలు చేసింది. అయితే ఏకపక్షంగా సాగిన టైబ్రేక్‌లో మాత్రం అంచనాలకు మించి రాణించింది. సర్వీస్‌తో పాటు అద్భుతమైన వ్యాలీలతో చెలరేగింది.

రెండోసెట్‌లో మరింత అప్రమత్తతతో వ్యవహరించిన ఇండో-క్రొయేషియా జోడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. అయితే ప్రత్యర్థుల సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్‌ను కాచుకుని మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మ్యాచ్ మొత్తంలో సానియా జంట 12; పేస్ ద్వయం 18సార్లు అనవసర తప్పిదాలు చేశారు. తమ సర్వీస్‌లో 76 శాతం పాయింట్లు సాధించిన సానియా-డోడిగ్... రెండో సర్వీస్‌లో మాత్రం 61 శాతమే నెగ్గారు. శుక్రవారం జరిగే సెమీస్‌లో సానియా జంట... ఐదోసీడ్ ఎలెనా వెస్నినా

 (రష్యా)- బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో తలపడతారు.
మరోవైపు సానియా-హింగిస్ జోడి ఇప్పటికే మహిళల డబుల్స్‌లో టైటిల్ పోరుకు చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా నేడే జరగనుంది. ఏడోసీడ్ చెక్ జోడి ఆండ్రియా హల్వకోవా-లూసి హర్డెకాతో వీళ్లు తలపడతారు. పదునైన సర్వీస్‌లు.. తిరుగులేని రిటర్న్... బలమైన బేస్‌లైన్ ఆటతో అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్... ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 6-0, 6-4తో నాలుగోసీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలెండ్)ను చిత్తు చేసింది. సెరెనాకు ఇది 26వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇది ఏడోసారి. ఓవరాల్‌గా కెరీర్‌లో 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా... ఓపెన్ ఎరాలో స్టెఫీగ్రాఫ్ (22) రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది.

మ్యాచ్ మొదలైన తొలి నిమిషంలో క్లీన్ విన్నర్‌తో బ్రేక్ పాయింట్ సాధించిన సెరెనా.... 64 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. తన సర్వీస్ పవర్‌ను చూపెట్టిన అమెరికా స్టార్ నెట్ వద్ద సూపర్ స్మాష్‌తో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ప్రత్యర్థి సర్వీస్‌ను అడ్డుకునే ప్రయత్నంలో రద్వాన్‌స్కా డబుల్ ఫాల్ట్ చేయడంతో ఆధిక్యం 3-0కు పెరిగింది. కొన్నిసార్లు సెరెనా కొట్టిన కచ్చితమైన షాట్లకు పోలెండ్ అమ్మాయి కోర్టులో పరుగెత్తలేకపోయింది. దీంతో 17 నిమిషాల్లోనే సెరెనా స్కోరు 5-0కు పెరిగింది.

తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకున్న అమెరికా ప్లేయర్ మరో మూడు నిమిషాల్లో సెట్‌ను ముగించింది.  రెండో సెట్‌లో సెరెనా బేస్‌లైన్ నుంచి కొట్టిన షాట్ నెట్‌కు తగలడం, ఆ వెంటనే రద్వాన్‌స్కా సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఇరువురు హోరాహోరీగా తలపడటంతో స్కోరు 3-3తో సమమైంది. డ్యూస్ వరకు వెళ్లిన ఏడో గేమ్‌లో రద్వాన్‌స్కా, ఎనిమిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. అయితే తొమ్మిదో గేమ్‌లో మరోసారి తడబడిన పోలెండ్ ప్లేయర్ సర్వీస్‌ను చేజార్చుకుంది. దీంతో స్కోరు 5-4గా మారింది. ఇక పదో గేమ్‌లో సెరెనా మూడు ఏస్‌లతో తొలి మ్యాచ్ పాయింట్‌ను సాధించింది.  మరో సెమీస్‌లో ఏడోసీడ్ కెర్బర్ (జర్మనీ) 7-5, 6-2తో జొహానా కొంటా (బ్రిటన్)పై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement