ఫెడరర్... సాఫీగా | Federer second round with ease to victory | Sakshi
Sakshi News home page

ఫెడరర్... సాఫీగా

Published Thu, Sep 3 2015 12:40 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

ఫెడరర్... సాఫీగా - Sakshi

ఫెడరర్... సాఫీగా

అలవోక విజయంతో రెండో రౌండ్‌లోకి
ఆండీ ముర్రే, వావ్రింకా కూడా  యూఎస్ ఓపెన్ టోర్నీ

 
న్యూయార్క్: మహిళల సింగిల్స్ విభాగంలో టాప్-10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారిణులు తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా... దానికి భిన్నంగా పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం సీడెడ్ ఆటగాళ్లు సునాయాస విజయాలతో శుభారంభం చేశారు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సులువైన ‘డ్రా’ పొందిన ఐదుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తోపాటు మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్), స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.
 అర్జెంటీనాకు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ లియోనార్డో మాయెర్‌తో జరిగిన తొలి రౌండ్‌లో ఫెడరర్ 6-1, 6-2, 6-2తో కేవలం 77 నిమిషాల్లో విజయం సాధించాడు. 34 ఏళ్ల ఈ స్విస్ స్టార్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు మాయెర్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ‘గతేడాది షాంఘై మాస్టర్స్ సిరీస్‌లో మాయెర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలిచాను. యూఎస్ ఓపెన్‌లో ఈసారి నా తొలి రౌండ్ ప్రత్యర్థి అతనే అని తేలడంతో గట్టిపోటీ తప్పదనుకున్నాను. కానీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటంతో వరుస సెట్‌లలో విజయం దక్కడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. వరుసగా 16వ సారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతోన్న ఫెడరర్ రెండో రౌండ్‌లో స్టీవ్ డార్సిస్ (బెల్జియం)తో తలపడతాడు.

 ఆస్ట్రేలియా యువతార నిక్ కిరియోస్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ ఆండీ ముర్రే 7-5, 6-3, 4-6, 6-1తో గెలుపొంది ముందంజ వేశాడు. 2 గంటల 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే ఏకంగా 18 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా 7-5, 6-4, 7-6 (8/6)తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై, ఆరో సీడ్ బెర్డిచ్ 6-3, 6-2, 6-4తో ఫ్రటాంగెలో (అమెరికా)పై, 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) 6-2, 6-3, 6-4తో జజిరి (ట్యూనిషియా)పై నెగ్గారు. అయితే 11వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-2, 6-4, 4-6, 4-6, 4-6తో డొనాల్డ్ యంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-5, 7-5, 7-6 (7/4)తో క్రాజ్నోవిచ్   (సెర్బియా)పై, 27వ సీడ్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) 7-5, 6-4, 7-6 (7/1)తో క్లిజాన్ (స్లొవేకియా)పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
 
 మూడో రౌండ్‌లోకి మాడిసన్ కీస్
 మహిళల సింగిల్స్ విభాగంలో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో కీస్ 6-1, 6-2తో స్మిట్‌కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందగా... 31వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) 5-7, 4-6తో కొంటావీట్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), నాలుగో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో క్విటోవా 6-1, 6-1తో సిగెముండ్ (జర్మనీ)పై, వొజ్నియాకి 6-2, 6-0తో జేమీ లోబ్ (అమెరికా)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-2, 6-4తో వితోఫ్ట్ (జర్మనీ)పై, 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-3, 6-1తో డల్గెరూ (రుమేనియా)పై, 18వ సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ) 3-6, 6-4, 7-5తో గార్సియా (ఫ్రాన్స్)పై గెలిచారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement