న్యూయార్క్: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. తొలి రెండు రౌండ్‌లలో అలవోకగా నెగ్గిన జొకోవిచ్‌కు మూడో రౌండ్‌లో తన దేశానికే చెందిన లాస్లో జెరె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి రెండు సెట్‌లను చేజార్చుకున్న జొకోవిచ్ 2006 తర్వాత యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పడతాడా అనే సందేహం కలిగింది.
అయితే అపార అనుభవం కలిగిన ఈ మాజీ చాంపియన్ పట్టుదలతో పోరాడి తేరుకున్నాడు. వరుసగా మూడు సెట్‌లను సొంతం చేసుకొని ఈ టోర్నీలో వరుసగా 16వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 4–6, 4–6, 6–1, 6–1, 6–3తో ప్రపంచ 38వ ర్యాంకర్ లాస్లో జెరెపై గెలుపొందాడు. ఈ పోరులో 12 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు.
నెట్ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచాడు. 34 విన్నర్స్ కొట్టిన అతను 36 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. మరోవైపు తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), పదో సీడ్ టియాఫో (అమెరికా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫ్రిట్జ్ 6–1, 6–2, 6–0తో మెన్‌సిక్ (చెక్ రిపబ్లిక్)పై, టియాఫో 4–6, 6–2, 6–3, 7–6 (8/6)తో 22వ సీడ్ మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గారు.
నాలుగో సీడ్ రిబాకినాకు షాక్
మహిళల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. గత ఏడాది వింబుల్డన్ చాంపియన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్‌లోనే నిష్క్రమించింది. 30వ సీడ్ సొరానా క్రిస్టియా (రొమేనియా) 2 గంటల 48 నిమిషాల్లో 6–3, 6–7 (6/8), 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినాను బోల్తా కొట్టించి 15వ ప్రయత్నంలో యూఎస్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ స్టార్ వొజ్నియాకి తన జోరు కొనసాగిస్తోంది.
మూడో రౌండ్‌లో వొజ్నియాకి గంటా 58 నిమిషాల్లో 4–6, 6–3, 6–1తో జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)ను ఓడించి 2016 తర్వాత ఈ టోర్నీలో మరోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్‌లో గాఫ్ 3–6, 6–3, 6–0తో 32వ సీడ్ ఎలీజ్ మెర్‌టెన్స్ (బెల్జియం)పై గెలిచింది. రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 13వ సీడ్ దరియా కసత్‌కినా (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. మూడో రౌండ్‌లో సబలెంకా 6–1, 6–1తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై, దరియా 6–3, 6–4తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై గెలిచారు.
8 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మ్యాచ్‌ల్లో తొలి రెండు సెట్‌లను కోల్పోయాక ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లను దక్కించుకొని విజయం అందుకోవడం జొకోవిచ్‌కిది ఎనిమిదోసారి కావడం విశేషం. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్‌పై కూడా జొకోవిచ్ ఈ తరహాలోనే గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment