17 ఏళ్ల తర్వాత...  | Federer winner of the Hopman Cup | Sakshi
Sakshi News home page

17 ఏళ్ల తర్వాత... 

Jan 7 2018 1:34 AM | Updated on Jan 7 2018 1:34 AM

Federer winner of the Hopman Cup - Sakshi

పెర్త్‌: అందరి అంచనాలను తారుమారు చేస్తూ గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఈ ఏడాదిలోనూ శుభారంభం చేశాడు. ప్రతిష్టాత్మక హాప్‌మన్‌ కప్‌లో సహచరురాలు బెలిండా బెన్సిచ్‌తో కలిసి అతను 17 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌కు టైటిల్‌ అందించాడు. శనివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్‌ జట్టు 2–1తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్, ఎంజెలిక్‌ కెర్బర్‌ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది. 30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో స్విట్జర్లాండ్‌ విజేతగా నిలువడం ఇది మూడోసారి. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి ఫెడరర్‌ ఈ టోర్నీలో టైటిల్‌ నెగ్గగా... 1992లో జాకబ్‌ హసెక్, మాన్యుయెలా మలీవా తొలిసారి స్విట్జర్లాండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు.  

శనివారం జరిగిన ఫైనల్లో పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–7 (4/7), 6–0, 6–2తో జ్వెరెవ్‌పై గెలిచి స్విట్జర్లాండ్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కెర్బర్‌ 6–4, 6–1తో బెన్సిచ్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌–బెన్సిచ్‌ జోడీ 4–3 (5/3), 4–2తో కెర్బర్‌–జ్వెరెవ్‌ జంటను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ను ‘బెస్ట్‌ ఆఫ్‌ త్రీ’ ఫాస్ట్‌4 టెన్నిస్‌ సెట్స్‌ పద్ధతిలో నిర్వహించారు. సెట్‌లో తొలుత నాలుగు గేమ్‌లు గెలిచిన వారికి సెట్‌ దక్కుతుంది. స్కోరు 3–3తో సమంగా నిలవడంతో నిబంధనల ప్రకారం ఎనిమిది పాయింట్లున్న టైబ్రేక్‌ను నిర్వహించారు. తొలుత ఐదు పాయింట్లు గెలిచిన ఫెడరర్‌ జంటకు తొలి సెట్‌ దక్కింది. రెండో సెట్‌లో ఫెడరర్‌ జోడీ నాలుగు గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement