Hopman Cup
-
17 ఏళ్ల తర్వాత...
పెర్త్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఈ ఏడాదిలోనూ శుభారంభం చేశాడు. ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్‌లో సహచరురాలు బెలిండా బెన్సిచ్తో కలిసి అతను 17 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌కు టైటిల్ అందించాడు. శనివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు 2–1తో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది. 30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి ఫెడరర్ ఈ టోర్నీలో టైటిల్ నెగ్గగా... 1992లో జాకబ్ హసెక్, మాన్యుయెలా మలీవా తొలిసారి స్విట్జర్లాండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు. శనివారం జరిగిన ఫైనల్లో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–7 (4/7), 6–0, 6–2తో జ్వెరెవ్‌పై గెలిచి స్విట్జర్లాండ్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కెర్బర్ 6–4, 6–1తో బెన్సిచ్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్–బెన్సిచ్ జోడీ 4–3 (5/3), 4–2తో కెర్బర్–జ్వెరెవ్ జంటను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ను ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ ఫాస్ట్4 టెన్నిస్ సెట్స్ పద్ధతిలో నిర్వహించారు. సెట్లో తొలుత నాలుగు గేమ్‌లు గెలిచిన వారికి సెట్ దక్కుతుంది. స్కోరు 3–3తో సమంగా నిలవడంతో నిబంధనల ప్రకారం ఎనిమిది పాయింట్లున్న టైబ్రేక్‌ను నిర్వహించారు. తొలుత ఐదు పాయింట్లు గెలిచిన ఫెడరర్ జంటకు తొలి సెట్ దక్కింది. రెండో సెట్లో ఫెడరర్ జోడీ నాలుగు గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
రోజర్ ఫెదరర్ 15 ఏళ్ల తర్వాత..
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 15 ఏళ్ల తర్వాత హాప్ మన్ కప్ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని కప్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది పెర్త్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలోవరల్డ్ నం.3 ఆటగాడు ఫెదరర్‌కు జోడీగా బెలిండా బిన్సిక్ బరిలో దిగుతాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్ కు కొన్నిరోజుల ముందు వార్మప్ టోర్నీగా హాప్ మన్ కప్ నిర్వహించనున్నారు. ఫెదరర్ చివరగా 2001లో మార్టినా హింగిస్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ నెగ్గాడు. ఆ తర్వాతి ఏడాది తన భార్య మిర్కా ఫెదరర్‌తో స్విస్ స్టార్ జతకట్టాడు. 2002 తర్వాత ఈ టోర్నీలో ఫెదరర్ పాల్గొనలేదు. సీజన్ స్టార్ట్ చేయడానికి అదే సరైన సమయమని ఫెదరర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రియోకు సన్నద్ధమవుతున్న స్విస్ స్టార్ కెనడా మేజర్ ఈవెంట్ టొరంటో మాస్టర్స్ టోర్నీ నుంచి వైదొలిగినట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఫ్రాన్స్ తొలిసారి...
పెర్త్: హాప్‌మన్ కప్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఈ మిక్స్డ్ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను ఫ్రాన్స్ సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడి పెర్త్ ఎరెనాలో జరిగిన టైటిల్ పోరులో ఫ్రాన్స్ 2-1తో పోలండ్పై విజయం సాధించింది. జో విల్ఫ్రెడ్ సోంగా తొలుత సింగిల్స్, తర్వాత కార్నెట్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందడంతో జట్టు నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ సోంగా 6-3, 3-6, 6-3తో గ్రెగొర్జ్ ప్యాన్ఫిల్పై నెగ్గడంతో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-3, 6-7 (9/7), 6-2తో అలైజ్ కార్నెట్‌పై గెలిచి 1-1తో స్కోరును సమం చేసింది. ఈ దశలో మిక్స్డ్ డబుల్స్‌లో కార్నెట్తో కలిసి బరిలోకి దిగిన సోంగా 6-0, 6-2తో రద్వాన్‌స్కా-ప్యాన్ఫిల్ జోడిని కంగుతినిపించాడు. కేవలం 47 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. సోంగా చక్కని ఆటతీరుతో త్వరలో ఆరంభమయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.