ఫెడరర్‌పై నాదల్ పైచేయి
సింగిల్స్, డబుల్స్‌లో విజయం ఐపీటీఎల్‌లో ఇండియన్ ఏసెస్ ‘సిక్సర్’
న్యూఢిల్లీ: వేదిక మారినా, ఫార్మాట్ మారినా... తన చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్-యూఏఈ రాయల్స్)పై రాఫెల్ నాదల్ (స్పెయిన్-ఇండియన్ ఏసెస్) మరోసారి పైచేయి సాధించాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భాగంగా వీరిద్దరూ శనివారం పురుషుల సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డారు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-రాఫెల్ నాదల్ (ఏసెస్) ద్వయం 6-4తో ఫెడరర్-మారిన్ సిలిచ్ (యూఈఏ రాయల్స్) జంటను ఓడించగా... పురుషుల సింగిల్స్‌లో నాదల్ 6-5 (7/4)తో ఫెడరర్‌ను ఓడించాడు.
ఏటీపీ సర్క్యూట్ ముఖాముఖి రికార్డులో నాదల్ 23-11తో ఫెడరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. నాదల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా ఐపీటీఎల్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తూ తమ ఖాతాలో ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. యూఏఈ రాయల్స్ జట్టుపై ఏసెస్ జట్టు 30-19 గేమ్‌ల తేడాతో విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న జోడీ (ఏసెస్) 6-4తో నెస్టర్-మ్లాడెనోవిచ్ (రాయల్స్) జంటపై; మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా (ఏసెస్) 6-1తో మ్లాడెనోవిచ్ (రాయల్స్)పై; లెజెండ్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-5 (7/4)తో గొరాన్ ఇవానిసెవిచ్ (రాయల్స్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 24-22తో జపాన్ వారియర్స్‌పై నెగ్గింది.