ఫెడెక్స్...ఫీనిక్స్ లా!
మళ్లీ పైకెగసిన వెటరన్
రిటైర్మెంట్ ప్రశ్నే లేదంటున్న ఫెడరర్
దాదాపు పధ్నాలుగేళ్ల క్రితం పీట్ సంప్రాస్ కెరీర్ కూడా డోలాయమానంలో ఉంది. 13 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్నా, కెరీర్ చరమాంకానికి చేరినట్లనిపిస్తోంది. 31 ఏళ్ల వయసు, అంతకుముందు ఆడిన ఆరు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆరంభ రౌండ్లలోనే పరాజయాలు. సంప్రాస్ శకం ముగిసిందని అంతా అనుకున్న సమయంలో అతను సంచలన ప్రదర్శనతో 2002 యూఎస్ ఓపెన్‌ను సొంతం చేసుకొని సత్తా చాటాడు. ఈ క్షణం కోసమే తాను ఆగానన్నట్లుగా అప్పుడే ఆటనుంచి తప్పుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు.
రోజర్ ఫెడరర్ అభిమానులు కూడా ఆదివారం అలాంటి ప్రకటన ఏదైనా రావచ్చేమోనని ఆందోళన చెందారు. 17 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు కొత్తగా సాధించి చూపించాల్సింది ఏమీ లేకపోయినా, తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాలని ఫెడరర్ భావించినట్లున్నాడు. అందుకే అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని పట్టుదలగా పోరాడాడు. ఇప్పుడు అద్భుత రీతిలో మరో గ్రాండ్‌స్లామ్ అతని ఖాతాలో చేరింది. మరోసారి తన ముద్రను చూపించి ఆటను ముగించేందుకు ఇలాంటిదే సరైన సమయమని చాలా మంది ఆటగాళ్లు భావిస్తారు. కానీ ఫెడరర్ అలా ఆలోచించడం లేదు!
సాక్షి క్రీడా విభాగం పునరాగమనం... ఫెడరర్‌కు ఈ మాట సరిగ్గా సరిపోకపోవచ్చు. అతనేమీ ఆటకు దూరం కాలేదు. గాయంతో ఆరు నెలల పాటు బరిలో దిగకపోయినా, అంతకుముందు మాత్రం తన స్థాయికి తగని ఆటతీరుతో పరాజయాలు ఎదుర్కొన్నాడు. ర్యాంకు పడిపోయింది. ఏడాది క్రితం కెరీర్‌లో తొలిసారి శస్త్రచికిత్స కూడా జరిగింది. అతనికంటే చురుకైన కుర్రాళ్లు ఎంతో మంది వచ్చేశారు. అతని ముందే ‘బేబీ ఫెడరర్’ అంటూ మరో ఆటగాడిని పోల్చడం కూడా ఇక నీ వయసైపోయిందని పరోక్షంగా చెబుతోంది. ఫెడరర్ కథ ముగిసిపోయినట్లేనని అంతా భావించారు. అతని ‘చివరి రోజులు’ అంటూ చాన్నాళ్ల క్రితమే కథనాలు వచ్చాయి. ఒకనాడు మొహమ్మద్ అలీ అంతటివాడు కూడా మళ్లీ రింగ్‌లోకి దిగి విఫలమైనప్పుడు ‘యువరాజు బండిలో ఇంటింటికి వెళ్లి చెత్తను పోగు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది’ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసిన తరహాలోనే ఫెడరర్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అతను ఆటను చాలించాల్సిన సమయం వచ్చిందని మాజీలు విశ్లేషించారు.
అందుకే కావచ్చు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక్కో రౌండ్ దాటుతున్న కొద్దీ దీనిని చాలా మంది ఫెడరర్ పునరాగమనంగానే చూశారు. ఇప్పుడు విజయంతో అతను అందరికీ సమాధానమిచ్చాడు. ఫీనిక్స్ పక్షిలా మరోసారి రివ్వున పైకి ఎగిశాడు. ‘నేను ఫ్రెంచ్ ఓపెన్ విజయం కోసం ఎంతో ప్రయత్నించాను. చాలా పోరాడాను. మళ్లీ మళ్లీ ప్రయత్నించి విఫలమయ్యాను. ఎట్టకేలకు దానిని అందుకోగలిగా. ఇప్పుడు ఈ విజయం దాదాపు అలాగే అనిపిస్తోంది. ఈ గెలుపును ఆస్వాదించేందుకు కూడా సమయం పడుతుందేమో’ అని ఉద్వేగంగా చెప్పడం అతని దృష్టిలో ఈ టైటిల్‌కు ఉన్న విలువేమిటో అర్థమవుతోంది.
మరో టైటిల్ వెనుక...
ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాడు ఇన్నేళ్ల తర్వాత కోచ్ నుంచి కొత్తగా నేర్చుకునేందుకు ఏముుం టుంది? కానీ ఫెడరర్ మాత్రం అలా ఆలోచించలేదు. నాలుగేళ్ల తర్వాత అతను మళ్లీ ‘మేజర్’ టైటిల్ గెలవడంలో ప్రధాన కోచ్ సెవెరిన్ ల్యూటీతో పాటు క్రొయేషియాకు చెందిన ఇవాన్ లుబిసిచ్ పాత్ర చాలా ఉంది. 2015లో ఘోర వైఫల్యం తర్వాత స్టీఫెన్ ఎడ్బర్గ్‌తో విడిపోయి మరో మాజీ ఆటగాడు లుబిసిచ్‌తో 2016 సీజన్‌లో కలిసి పని చేయబోతున్నట్లు రోజర్ ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తాను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను కూడా కొద్ది రోజుల క్రితమే విడుదల చేసిన అతను తన ఆత్మవిశ్వాసం లో కోచ్ తెచ్చిన మార్పు గురించి చెప్పాడు. ‘ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునేందుకు ఏదైనా ఉంటుందని నేను నమ్ముతాను. దీంతో పాటు పోరాడాలనే పట్టుదల, విజయాలు సాధించాలనే కసి కూడా మనలో రగిలించాలి. లుబిసిచ్ నాకు ఈ విషయంలో ఎంతో తోడ్పడ్డారు. నేను సొంతంగా బాగా ఆడగలిగినా, వారి వల్ల పది శాతం ఆట మెరుగైనా అది ఎంతో ముఖ్యం’ అని ఫెడరర్ కృతజ్ఞతలు చెప్పాడు. ఆరు నెలలపాటు ఆటకు దూరమైన తర్వాత కోలుకొని రాణించడంలో ఫిజియోథెరపిస్ట్ డానియెల్ ట్రాక్స్‌లర్, ఫిట్‌నెస్ ట్రైనర్ పియరీ ప్యాగినినీ కూడా రోజర్‌కు అండగా నిలిచారు. చాంపియన్ ఆటగాడిగా ఫెడరర్ కష్టం వృథా పోలేదు.
మళ్లీ వస్తాను...
ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ స్వీకరించే సమయంలో ‘వచ్చే ఏడాది మళ్లీ వస్తాను. ఒకవేళ రాలేకపోతే ఇక్కడ అద్భుతమైన రీతిలో ముగించానని అనుకోవచ్చు’ అని వ్యాఖ్యానించడంతో ఫెడరర్ భవిష్యత్తు గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘ఒకవేళ’ అనడంలోనే ఇక రోజర్ నాటకీయ రీతిలో తన శుభం కార్డు వేస్తున్నాడని కూడా టెన్నిస్ ప్రపంచం దాదాపు నిర్ధారణకు వచ్చేసింది. అయితే మరుసటి రోజు అతను ఇచ్చిన వివరణ ఫెడెక్స్ ఫ్యాన్స్‌ను సంతోషపరిచింది. ‘తర్వాతి గ్రాండ్‌స్లామ్ ఏమిటనేది ఎవరూ చెప్పలేరు. నేను గాయపడవచ్చు కూడా. ఐదు సెట్‌ల మ్యాచ్‌లు మూడు ఆడానంటే పరిస్థితి అర్థమవుతుంది. కఠినంగా సాగిన గత ఏడాది తర్వాత ఇక్కడ మళ్లీ గెలవగలిగాను. నా కోసం మరో అవకాశం ఎదురు చూస్తోందా లేదా అనేది మనం ప్రణాళిక వేసుకున్నంత సులువు కాదు’ అని అతను స్పష్టం చేశాడు. పైగా మరో మూడు వారాల్లో ప్రారంభం కానున్న దుబాయ్ ఓపెన్ మొదలు వింబుల్డన్ సన్నాహక టోర్నీల వరకు కూడా తాను పాల్గొనే టోర్నమెంట్‌ల జాబితా అతను చెప్పేశాడు. వింబుల్డన్‌లో తనకు మంచి అవకాశం ఉందని, ఫ్రెంచ్ ఓపెన్ గురించి పెద్దగా ఆశలు లేవంటూ తన బలాలు, బలహీనతల గురించి కూడా నిర్మొహమాటంగా చెబుతూ ఫెడరర్ ఇచ్చిన స్పష్టత అతని ఉద్దేశాలు ఏమిటో చాటి చెబుతోంది. తరం మారినా నన్ను ఓడించడం మీతరం కాదంటూ కొత్త ఆటగాళ్లకు సవాల్ విసురుతున్న ఈ స్విస్ సూపర్ స్టార్ కోసం ఇంకా ఎన్ని స్లామ్‌లు ఎదురు చూస్తున్నాయో!