కెరీర్‌లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్ ఆడిన భారత యువ ప్లేయర్ సుమీత్ నాగల్ సంచలన ప్రదర్శన చేశాడు. 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత ఫెడరర్‌పై ఏకంగా తొలి సెట్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఫెడరర్ వెంటనే తేరుకొని ఆ తర్వాతి మూడు సెట్‌లను సాధించి విజయాన్ని అందుకున్నాడు. మొత్తానికి మ్యాచ్ ఓడినా... తన ఆటతో సుమీత్ మనసులు గెల్చుకున్నాడు.
న్యూయార్క్: ఊహించిన ఫలితమే వచ్చినా... భారత యువ ఆటగాడు సుమీత్ నాగల్ పరాజయంలోనూ గౌరవాన్ని పొందాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్, ప్రపంచ 190వ ర్యాంకర్ సుమీత్ నాగల్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్, 38 ఏళ్ల రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ 6–4, 1–6, 2–6, 4–6తో ఓడిపోయాడు. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్ కళ్లు చెదిరే ఇన్‌సైడ్ అవుట్ ఫోర్‌హ్యాండ్ షాట్‌లతో అలరించాడు. మ్యాచ్ సాగుతున్నకొద్దీ ఫెడరర్ దూకుడు పెంచగా... అంతర్జాతీయ అనుభవం అంతగా లేకున్నా సుమీత్ ప్రతీ పాయింట్‌కు తన శక్తినంతా ధారపోసి ఆడాడు. ఫెడరర్‌కు సులువుగా పాయింట్లు ఇవ్వకుండా పోరాడాడు.
మ్యాచ్ మొత్తంలో ఫెడరర్ 12 ఏస్‌లు సంధించి 7 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 57 అనవసర తప్పిదాలు చేసిన స్విస్ దిగ్గజం ఏడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరోవైపు సుమీత్ మూడుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 32 అనవసర తప్పిదాలు చేశాడు. ‘ఫెడరర్‌లాంటి దిగ్గజంతో నా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్ ఆడినందుకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఫెడరర్ ఆటను చూశాక ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను’ అని 22 ఏళ్ల సుమీత్ వ్యాఖ్యానించాడు. ‘సుమీత్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంది. ఈ మ్యాచ్‌లో అతను చాలా నిలకడగా ఆడాడు.
అంతర్జాతీయస్థాయిలో సక్సెస్ సాధించాలంటే ఈ రకమైన ఆటతీరును కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఫెడరర్ అన్నాడు. తొలి రౌండ్‌లో ఓడిన సుమీత్‌కు 35 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 58,000 డాలర్ల (రూ. 41 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఫెడరర్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో జొకోవిచ్ 6–4, 6–1, 6–4తో కార్‌బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–1, 6–1తో షరపోవా (రష్యా)పై గెలిచింది.
గత రెండు దశాబ్దాల్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ మ్యాచ్‌లో ఒక సెట్ గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్ సుమీత్. గతంలో సోమ్‌దేవ్, యూకీ బాంబ్రీ, సాకేత్ ఈ ఘనత సాధించారు. ఫెడరర్‌పై మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లో సెట్ గెలిచిన ఏకైక భారతీయ ప్లేయర్ సుమీత్. గతంలో ఫెడరర్‌తో రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ మ్యాచ్‌లు ఆడినా వరుస సెట్‌లలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment