క్వార్టర్స్‌లో ఫెడరర్
∙ డెల్‌పొట్రోతో పోరుకు సిద్ధం
∙ మిక్స్‌డ్‌లో ఓడిన బోపన్న జోడి
∙ యూఎస్ ఓపెన్
క్వార్టర్ ఫైనల్లో కసి తీర్చుకునే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అర్జెంటీనా స్టార్ డెల్ పొట్రోతో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తలపడనున్నాడు. యూఎస్ ఓపెన్‌లో వరుస టైటిళ్లతో (2004–2008) దూసుకెళ్తున్న ఫెడెక్స్‌కు 2009 ఫైనల్లో డెల్ పొట్రో షాకిచ్చాడు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత రోజర్‌కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇందులో చెలరేగితే సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థుల (నాదల్, ఫెడరర్) మధ్య ఆసక్తికర సమరం జరిగే అవకాశముంది.
న్యూయార్క్: టోర్నమెంట్ మొదట్లో ప్రతీ మ్యాచ్‌లోనూ చెమటోడ్చిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టోర్నీ జరుగుతున్న కొద్దీ చెలరేగుతున్నాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ మాజీ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్విట్జర్లాండ్ స్టార్ 6–4, 6–2, 7–5తో ఫిలిప్ కొహ్ల్‌ష్చెబెర్ (జర్మనీ, 33వ సీడ్)పై అలవోక విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో 24వ సీడ్ జువన్ మార్టిన్ డెల్ పొట్రో (అర్జెంటీనా) 1–6, 2–6, 6–1, 7–6 (7/1), 6–4తో ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను కంగుతినిపించగా... అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 7–5, 7–6 (7/5), 6–3తో తొమ్మిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)కు షాకిచ్చాడు.
ఫెడెక్స్ జోరు
యూఎస్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోజర్ ఫెడరర్ ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థిని వరుస సెట్లలో ఓడించాడు. గంటా 49 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఫిలిప్ కొహ్ల్‌ష్చెబెర్ ఒక్క మూడో సెట్‌లోనే కాస్త పోటీఇచ్చాడు. ఐదు సార్లు యూఎస్ చాంపియన్ అయిన ఫెడరర్ ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు సంధించాడు. 15 విన్నర్స్ కొట్టిన ఫెడెక్స్ 10 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో సెట్‌నైతే రోజర్ వేగంగా ముగించేశాడు. ప్రత్యర్థికేమాత్రం అవకాశమివ్వకుండా కేవలం 27 నిమిషాల్లోనే ఆటకట్టించాడు. మూడో సెట్‌లో జర్మనీ ఆటగాడు కొహ్ల్‌ష్చెబెర్ కాస్త పోరాడినా ఫెడరర్ ధాటికి అదేమాత్రం సరిపోలేదు. ఐదు సెట్ల పాటు జరిగిన హోరాహోరీ పోరులో డెల్ పొట్రో ఆరో సీడ్ థీమ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. అర్జెంటీనా ఆటగాడు 9 ఏస్‌లు సంధించి, 31 విన్నర్స్ కొట్టాడు. దీటుగానే బదులిచ్చిన థీమ్ 5 ఏస్‌లు, 51 విన్నర్స్ కొట్టాడు. అనవసర తప్పిదాల్లో ఇద్దరూ అర్ధసెంచరీ దాటేశారు. డెల్ పొట్రో 59, థీమ్ 53 చేశారు. క్వార్టర్ ఫైనల్లో డెల్ పొట్రోతో ఫెడరర్ తలపడనున్న నేపథ్యంలో ఎనిమిదేళ్ల క్రితం 2009లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఫెడరర్‌కు లభించింది.
స్వితోలినా ఔట్
మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) కథ ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/2), 1–6, 6–4తో స్వితోలినాపై విజయం సాధించింది. తొలి సెట్‌లో ఇద్దరు పోటాపోటీగా తలపడటంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. అయితే ఇందులో కీస్ పైచేయి సాధించింది. తర్వాత సెట్లో పుంజుకున్న ఉక్రెయిన్ క్రీడాకారిణి కేవలం 24 నిమిషాల్లో సెట్‌ను చేజిక్కించుకుంది. నిర్ణాయక పోరులో పోరాడినప్పటికీ కీస్ చేతిలో పరాజయం తప్పలేదు.
మిక్స్‌డ్‌లో బోపన్న ఔట్: మిక్స్‌డ్ డబుల్స్‌లో ఏడో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–దబ్రౌస్కీ (కెనడా) జంటకు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. మూడో సీడ్ మైకేల్ వీనస్– హ చింగ్ చాన్ (చైనీస్ తైపీ) ద్వయం 4–6, 6–3, 10–8తో సూపర్ టైబ్రేక్‌లో బోపన్న జంటను కంగుతినిపించింది.