‘దశ’ధీర
యూఎస్ ఓపెన్ విజేత జొకోవిచ్
కెరీర్‌లో పదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం
ఫైనల్లో ఫెడరర్‌పై అద్భుత విజయం
రూ. 25 కోట్ల 21 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
ప్రత్యర్థి గొప్పవాడైతే తనలోని నైపుణ్యం మరింతగా బయటపడుతుందని నిరూపిస్తూ... సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. టెన్నిస్‌లో పరిపూర్ణ ఆటతీరుకు పెట్టింది పేరైన ఫెడరర్‌లాంటి ప్రత్యర్థి అంతిమ సమరంలో ఎదురునిలిస్తే... ‘స్విస్’ స్టార్‌కంటే తానేం తక్కువ కాదని రుజువు చేస్తూ జొకోవిచ్ జయకేతనం ఎగురవేశాడు. కెరీర్‌లో పదో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని సమకాలీన టెన్నిస్‌లో ‘దశ’ ధీరుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
న్యూయార్క్: మూడేళ్లుగా ఊరిస్తున్న ‘గ్రాండ్‌స్లామ్’ విజయాన్ని ఈసారైనా సాధించాలని ఆశించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆశలను వమ్ము చేస్తూ... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6-4, 5-7, 6-4, 6-4తో రెండో సీడ్ ఫెడరర్‌ను ఓడించాడు. తద్వారా తన కెరీర్‌లో రెండోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను, ఓవరాల్‌గా పదో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని హస్తగతం చేసుకున్నాడు.
విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 38 లక్షల డాలర్ల (రూ. 25 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీ లభిం చింది. ఈ ప్రైజ్‌మనీలో యూఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహించిన టోర్నీలలో రాణించినందుకు జొకోవిచ్‌కు బోనస్‌గా ఇచ్చిన 5 లక్షల డాలర్లు ఉన్నాయి. రన్నరప్ ఫెడరర్‌కు 16 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 59 లక్షలు) దక్కాయి.3 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఇద్దరూ ప్రతీ పాయింట్‌కూ నువ్వా నేనా అనే రీతిలో పోరాడి, తమ అత్యుత్తమ ఆటతీరును కనబరిచి ప్రేక్షకులను అలరించారు.
ఈ టోర్నీలో కొత్త వ్యూహాలతో బరిలోకి దిగి మంచి ఫలితాలను సాధించిన 34 ఏళ్ల ఫెడరర్ ఫైనల్లో మాత్రం జొకోవిచ్ జోరును నిలువరించ లేకపోయాడు. ఫెడరర్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్, తన సర్వీస్‌ను నాలుగుసార్లు మాత్రమే కోల్పోయాడు. జొకోవిచ్ దూకుడైన ఆటతీరు కారణంగా ఫెడరర్ ఒత్తిడికిలోనై ఏకంగా 54 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 59 సార్లు దూసుకొచ్చినా కేవలం 39 సార్లు పాయింట్లు నెగ్గడంలో సఫలమయ్యాడు.
ఫెడరర్ శక్తివంతమైన సర్వీస్‌లకు అంతే దీటుగా జవాబిస్తూ... నెట్ వద్ద కూడా అప్రమత్తంగా ఉంటూ... సుదీర్ఘ ర్యాలీలలో పైచేయి సాధిస్తూ... జొకోవిచ్ తనలోని మేటి ఆటతీరును ప్రదర్శించాడు. కొన్నిసార్లు ఫెడరర్ మెరుపులు మెరిపించినా కీలకదశలో మాత్రం తడబడ్డాడు. జొకోవిచ్ సర్వీస్‌లో ఫెడరర్‌కు 23 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వచ్చినా, అతను కేవలం నాలుగుసార్లు మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకోగలిగాడు.
జొకోవిచ్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్‌కు చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లలో విజేతగా నిలిచి, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు.ఇప్పటివరకు జొకోవిచ్ ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, మూడుసార్లు వింబుల్డన్‌లో, రెండుసార్లు యూఎస్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించాడు.ఒకే ఏడాది 3 గ్రాండ్‌స్లామ్స్‌ను సాధించడం జొకోవిచ్‌కిది రెండోసారి. 2011లోనూ అతను ఈ ఘనత సాధించాడు. గతంలో ఫెడరర్, నాదల్, విలాండర్, కానర్స్, రాడ్ లేవర్ ఈ ఘనత సాధించారు.
‘నా గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య రెండంకెలకు చేరింది. ఇన్ని టైటిల్స్ గెలిచిన దిగ్గజాల సరసన నిలవడం సంతోషంగా ఉంది. ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌ల ఫీట్‌ను పునరావృతం చేయడం అంత సులువు కాదు. అయినా సాధించగలిగాను. ఇప్పుడు నాకు 28 ఏళ్లు. నాకు నా గురించి, నా కెరీర్ గురించి బాగా తెలుసు. నా ఆటలో, జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోను. ఇకపై మరిన్ని టైటిల్స్ సాధించగలననే నమ్మకముంది. దాని కోసం శ్రమిస్తా.’ -జొకోవిచ్