ఫెడరర్ ఇంకా ఆడుతున్నాడా?
మాడ్రిడ్ : స్పెయిన్‌కు చెందిన జీసస్ అపారికో అనే వ్యక్తికి స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ ఫెడరర్ అంటే విపరీతమైన అభిమానం. తన రోల్‌మోడల్ ఫెడరర్ ఆట చూడటానికి మిగతా పనులన్నీ మానేసేవాడు. అయితే 2004 డిసెంబరు 12న అప్పటికి 18 ఏళ్ల వయసున్న అపారికో... ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. కట్‌చేస్తే... 11 ఏళ్ల తర్వాత ఇటీవలే కోమాలోంచి బయటపడ్డాడు. అయితే ఏ విషయాన్నీ పూర్తిగా గుర్తు తెచ్చుకోలేకపోయాడట.
ఆ సమయంలో ఫెడరర్ ఆడుతున్న టెన్నిస్ మ్యాచ్‌ను చూసి ఒక్కసారి అవాక్కయ్యాడంట. ఫెడరర్ ఇంకా ఆడుతున్నాడా..? అంటూ ఒక్కసారిగా అప్పట్లో ఫెడరర్ సాధించిన ఘనతలను చెప్పడం మొదలుపెట్టాడట. తను కోమాలోకి వెళ్లినప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న ఫెడరర్ ఆ సీజన్‌లో నాలిగింటిలో మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాడని చెబుతున్నాడు. ‘ఫెడరర్ 34 ఏళ్ల వయసులోనూ ఇంకా ఆడుతుండటంతో పాటు రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. మొదట దీనిని నమ్మలేకపోయా.
నన్ను ఆట పట్టిస్తున్నారని భావించా. 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచాడని చెప్పటంతో సిగ్గుతో చేతులతో నా ముఖాన్ని కప్పేసుకున్నా. బాగా ఆడతాడని అనుకున్నా. కానీ ఇన్ని టైటిల్స్ గెలుస్తాడని మాత్రం ఊహించలేదు. అప్పట్లో ఫెడరర్‌కు హెవిట్ గట్టిపోటీ ఇచ్చేవాడు’ అని అపారికో వెల్లడించాడు. ఫెడరర్‌ను గుర్తించాక ఇతర పాత విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాడట. యాక్సిడెంట్‌కు ముందు వింబుల్డన్‌కు వెళ్లాలని డబ్బులు పొదుపు చేసుకున్న అపారికో... ఇప్పుడు తన హీరో ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమవుతుండటం కొసమెరుపు.