
యోధుడు నిలిచాడు
♦ వింబుల్డన్ సెమీస్‌లో ఫెడరర్
♦ ఉత్కంఠ పోరులో సిలిచ్‌పై గెలుపు
♦ రావోనిక్, బెర్డిచ్ కూడా ముందుకు
నాలుగేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పోరాటం చేస్తున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్... వింబుల్డన్‌లో తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. రెండు సెట్లు వెనుకబడి... నాలుగో సెట్‌లో మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకుని ఓ యోధుడిలా పోరాడాడు. దీంతో ఉత్కంఠ రేకెత్తించిన క్వార్టర్స్ పోరులో చివరి వరకు సిలిచ్‌ను సింహంలా వేటాడి గెలిచి నిలిచాడు.
లండన్: ప్రత్యర్థి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైనా... తనదైన శైలిలో చెలరేగిన ప్రపంచ మూడో ర్యాంకర్ రోజర్ ఫెడరర్... వింబుల్డన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో మూడోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-7 (4/7), 4-6, 6-3, 7-6 (11/9), 6-3తో తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. వింబుల్డన్‌లో ఫెడరర్ సెమీస్‌కు చేరడం ఇది 11వసారి కాగా, మేజర్ టోర్నీల్లో 40వది.
వింబుల్డన్‌లో 84వ గెలుపుతో జిమ్మీ కానర్స్ రికార్డును సమం చేసిన ఫెడరర్... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 307 విజయాలతో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఎనిమిదోసారి వింబుల్డన్ టోర్నీ కోసం బరిలోకి దిగిన ఫెడరర్.... మ్యాచ్‌లో రెండు సెట్లు వెనుకబడి గెలవడం కెరీర్‌లో పదోసారి. కెన్ రోస్‌వాల్ (1974) తర్వాత సెమీస్‌కు చేరిన ఎక్కువ వయసు క్రీడాకారుడిగా కూడా ఫెడరర్ (39 ఏళ్లు) రికార్డులకెక్కాడు.
సెంటర్ కోర్టులో మూడు గంటలా 17 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్, సిలిచ్‌లు కొదమ సింహాల్లా తలపడ్డారు. స్విస్ స్టార్ 27 ఏస్‌లు, 67 విన్నర్లు సంధించి... 2014 యూఎస్ ఓపెన్ సెమీస్‌లో సిలిచ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే తొలిసెట్ ఐదో గేమ్‌లో కేవలం బ్రేక్ పాయింట్లను మాత్రమే కాచుకున్న ఫెడరర్.. టైబ్రేక్‌లో వెనుబడ్డాడు. 5-0 ఆధిక్యంలో ఉన్నప్పుడు సిలిచ్ నాలుగుసార్లు సెట్ పాయింట్లను చేజార్చుకున్నా చివరకు ఫలితాన్ని సాధించాడు. ఇక రెండో సెట్‌లోనూ క్రొయేషియన్ జోరు చూపెట్టడంతో ఫెడరర్ ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే మూడో సెట్ ఏడో గేమ్‌లో మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని ఫెడరర్ మ్యాచ్‌లో నిలిచాడు.
ఇక దాదాపు గంటపాటు సాగిన నాలుగో సెట్‌లో సర్వీస్‌లతో చెలరేగిన సిలిచ్ ఓ దశలో 5-4 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పదో గేమ్‌లో ఫెడరర్ మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకోవడంతో గేమ్ మలుపు తిరిగింది. తర్వాత ఇద్దరు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లో రెండు సెట్ పాయింట్లను చేజార్చుకున్న స్విస్ స్టార్... సిలిచ్ తన సర్వీస్‌లో కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్ నెట్‌కు తగలడంతో మూడో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఉత్కంఠగా సాగిన పోరులో మరో రెండుసార్లు ఫెడరర్ సెట్ పాయింట్లను కోల్పోయాడు. కానీ సిలిచ్ కొట్టిన షాట్స్ కూడా పదేపదే నెట్‌కు తాకడంతో సెట్ ఫెడరర్ సొంతమైంది. ఇక ఐదో సెట్‌లో తన అనుభవాన్ని రంగరించిన ఫెడరర్... బలమైన బేస్‌లైన్ ఆటతో సిలిచ్ ఆట కట్టించాడు.
రావోనిక్ కూడా..
ఇతర క్వార్టర్స్ పోరులో ఆరోసీడ్ మిలోస్ రావోనిక్ (కెనడా) 6-4, 7-5, 5-7, 6-4తో 28వ సీడ్ స్యామ్ క్వెరీ (అమెరికా)పై; 10వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్) 7-6 (7/4), 6-3, 6-2తో 32వ సీడ్ లుకాస్ పౌలీ (ఫ్రాన్స్)పై నెగ్గారు. శుక్రవారం జరిగే సెమీస్‌లో ఫెడరర్.. రావోనిక్‌తో తలపడతాడు.