జాగ్రెబ్(క్రోయేషియా): అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాను యూఎస్ గ్రాండ్ స్లామ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇటీవల స్పష్టం చేసిన సెర్బియా టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను ఇప్పుడు అదే భయం వెంటాడుతోంది. క్రోయేషియాలో జరిగిన ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో భాగంగా తనతో ఆడిన బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో జొకోవిచ్‌లో భయం రెట్టింపు అయ్యింది. గతవారం ఎగ్జిబిషన్ టోర్నమెంట్‌లో భాగంగా జొకోవిచ్- దిమిత్రోవ్‌లు కలిసి డబుల్స్ ఆడారు. ఆ తర్వాత సెకండ్ లెగ్‌లో మరో మ్యాచ్ ఆడిన దిమిత్రోవ్‌కు జ్వరం రావడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. (నీకేంటి.. ఈజీగానే వదిలేస్తావ్!)
ఈ మేరకు తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని దిమిత్రోవ్ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సన్నిహితులకు, ఫ్యాన్స్‌కు తెలియజేయాల్సిన అవసరం ఉందన్న దిమిత్రోవ్..ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. రెండో లెగ్‌లో శనివారం బోర్నా కారిక్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత దిమిత్రోవ్‌లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆ మ్యాచ్‌ను దిమిత్రోవ్ కోల్పోయిన అనంతరం టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, గత కొన్ని రోజుల నుంచి తనతో ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వారి పేర్లు కూడా వెల్లడించిన దిమిత్రోవ్.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తనతో ఆడిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. ‘నేను ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాను. నాకు తెలియకుండా ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే నన్ను క్షమించండి. ప్రస్తుతం నేను ఇంట్లోనే కోలుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ థాంక్స్’అని ప్రపంచ 19వ ర్యాంకర్ దిమిత్రోవ్ ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. దిమిత్రోవ్‌కు కరోనా అని తేలడంతో ఆ ఫైనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్-ఆండ్రీ రూబ్లెవ్‌లు తలపడాల్సి ఉండగా, దాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment