యూరప్‌లో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినా... అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఫిట్‌నెస్ గొప్పగా ఉన్న వాళ్లూ ఈ మహమ్మారి బారిన పడటం ఖాయమని తేలిపోయింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడంలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వైరస్‌ను మనం ఆహ్వానించినట్లేనని టెన్నిస్ ప్రపంచంలోని తాజా ఉదంతం చెబుతోంది. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో పడిన వర్ధమాన టెన్నిస్ క్రీడాకారుల కోసం నిధులు సేకరించాలనే సదుద్దేశంతో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ టోర్నీలపై వివాదం చెలరేగింది. ఈ టోర్నీల్లో ఆడిన దిమిత్రోవ్, బోర్నా చోరిచ్ కరోనా బారిన పడగా... వీరిద్దరి సరసన స్వయంగా నొవాక్ జొకోవిచ్, అతని సహచరుడు విక్టర్ ట్రయెస్కీ చేరడంతో టెన్నిస్ ప్రపంచంలో కరోనా కలకలం సృష్టించింది. జొకోవిచ్, ట్రయెస్కీలతోపాటు వారిద్దరి భార్యలకూ కోవిడ్–19 పాజిటివ్ ఫలితం రావడం గమనార్హం.
బెల్‌గ్రేడ్ (సెర్బియా): కరోనా మహమ్మారి విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాడు. తనతోపాటు భార్య జెలెనాకు కోవిడ్–19 పాజిటివ్ వచ్చిందని... అయితే ఇద్దరిలోనూ ఈ వైరస్ లక్షణాలు లేవని జొకోవిచ్ ప్రకటించాడు. తమ ఇద్దరి పిల్లలకు మాత్రం నెగెటివ్ ఫలితం వచ్చిందని నొవాక్ తెలిపాడు. 14 రోజులపాటు తామిద్దరం స్వీయ నిర్బంధంలోకి వెళ్లి చికిత్స తీసుకుంటామని... తమ టోర్నీల కారణంగా కరోనా బారిన పడ్డ వారందరూ పెద్ద మనసుతో క్షమించాలని నొవాక్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరాడు. జొకోవిచ్ సహచరుడు, ఈ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడిన సెర్బియాకే చెందిన మరో టెన్నిస్ ప్లేయర్ విక్టర్ ట్రయెస్కీ, గర్భవతిగా ఉన్న అతని భార్యకు కూడా కోవిడ్–19 పాజిటివ్ ఫలితం వచ్చింది.
ఈ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న ప్రపంచ 19వ ర్యాంకర్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), క్రొయేషియా ఆటగాడు బోర్నా చోరిచ్, నొవాక్ ఫిట్‌నెస్ కోచ్ మార్కో పానిచి సోమవారమే ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా నొవాక్, ట్రయెస్కీలకు ఈ మహమ్మారి సోకడంతో ప్రపంచ టెన్నిస్‌లో కలకలం చోటు చేసుకుంది. గత వారం తన సోదరుడు జార్జెతో కలిసి తానే నిర్వాహకుడిగా మారి జొకోవిచ్ ఒక టెన్నిస్ ఎగ్జిబిషన్ టోర్నీలను నిర్వహించాడు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన తొలి అంచె పోటీలు బెల్‌గ్రేడ్‌లో జరగ్గా... క్రొయేషియా వేదికగా రెండో అంచె టోర్నీ జరిగింది. ఈ టోర్నీ సందర్భంగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో దిమిత్రోవ్, చోరిచ్‌లతో పాటు జొకోవిచ్ ఫిట్‌నెస్ కోచ్‌కు కరోనా అని తేలింది. దాంతో టోర్నీని నిలిపేశారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ టోర్నీలను నిర్వహించడమే కాకుండా వేల సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించారు. ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం చేశారు. మ్యాచ్‌లు ముగిశాక జొకోవిచ్‌తో సహ ఇతర ఆటగాళ్లందరూ నైట్‌క్లబ్‌లకు వెళ్లి పార్టీలు చేసుకున్నారు. చివరకు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment