జాగ్రెబ్ (క్రొయేషియా): పురుషుల టెన్నిస్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎగ్జిబిషన్ ఈవెంట్ ఆడిన ప్రపంచ 19వ ర్యాంకర్, మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ సెమీఫైనలిస్ట్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా)... క్రొయేషియా యువతార, ప్రపంచ 33వ ర్యాంకర్ బొర్నా చోరిచ్... ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫిట్‌నెస్ కోచ్ మార్కో పానిచి కరోనా వైరస్ బారిన పడ్డారు. మార్చి నుంచి అన్ని రకాల టెన్నిస్ టోర్నీలన్నీ బంద్ కాగా... వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ సిరీస్ ఈవెంట్లు ఈ మధ్యే మొదలయ్యాయి. తొలి అంచె పోటీలు సెర్బియా (బెల్‌గ్రేడ్)లో ముగియగా, రెండో అంచె పోటీలకు క్రొయేషియా వేదిక. ఇక్కడే శనివారం జరిగిన మ్యాచ్‌లో దిమిత్రోవ్‌తో చోరిచ్ తలపడ్డాడు. ఇప్పుడు వీళ్లిద్దరికీ కరోనా సోకడంతో నిర్వాహకులు ఈవెంట్‌నే రద్దు చేశారు.
దీంతో ఆదివారం జొకోవిచ్, ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ల మధ్య జరగాల్సిన ఫైనల్ అటకెక్కింది. తమ టోర్నీలో ఆడుతూ కరోనా బారిన పడటం పట్ల నిర్వాహకుడు జార్జె జొకోవిచ్ (నొవాక్ జొకోవిచ్ సోదరుడు) క్షమాపణలు చెప్పాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ చేరుకున్న వెంటనే నొవాక్ జొకోవిచ్ కూడా కోవిడ్–19 పరీక్ష చేయించుకుంటాడని జార్జె తెలిపాడు. కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ టోర్నీలేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమర్శకులు, టెన్నిస్ వర్గాలు జొకోవిచ్ నిర్వాకంపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment