న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ గార్సియా తన జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గార్సియా 6–3, 6–4తో అమెరికా టీనేజర్, 12వ సీడ్ కోకో గాఫ్‌పై విజయం సాధించింది.
ఈ ఏడాది మూడు టైటిల్స్ నెగ్గి సూపర్ ఫామ్‌లో ఉన్న 28 ఏళ్ల గార్సియా యూఎస్ ఓపెన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీఫైనల్‌కు చేరింది. కోకో గాఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో గార్సియా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 24 విన్సర్స్ కొట్టిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచింది. 2011లో ప్రొఫెషనల్‌గా మారిన గార్సియా ఇప్పటివరకు 41 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది.
2017లో ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆమె అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. పదోసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న గార్సియా సెమీఫైనల్ చేరడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన మూడోఫ్రాన్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో ఫ్రాన్స్ నుంచి అమెలీ మౌరెస్మో (2002, 2006), మేరీ పియర్స్ (2005) సెమీఫైనల్ చేరారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)తో గార్సియా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో జబర్ 2–0తో గార్సియాపై ఆధిక్యంలో ఉంది.
జబర్ జోరు...
ఈ ఏడాది 42 విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్యూనిషియా ప్లేయర్ ఆన్స్ జబర్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జబర్ 6–4, 7–6 (7/4)తో తొమ్లాయనోవిచ్‌పై గెలిచింది. ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్
టోర్నీల్లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా జబర్ నిలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) 6–1, 7–6 (7/4)తో 22వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 82 నిమిషాలపాటు జరి గిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
కిరియోస్ జోరుకు ఖచనోవ్ బ్రేక్
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా) తొలిసారి తన కెరీర్‌లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో... ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్, 23వ సీడ్ నిక్ కిరియోస్‌తో 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 7–5, 4–6, 7–5, 6–7 (3/7), 6–4తో గెలుపొందాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 30 ఏస్‌లు సంధించాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించిన కిరియోస్ 31 ఏస్‌లు సంధించినా 58 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కిరియోస్ కోపంతో తన రెండు రాకెట్‌లను నేలకేసి కొట్టి విరగొట్టడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో కాస్పర్ రూడ్ 6–1, 6–4, 7–6 (7/4)తో 13వ సీడ్ మారియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ సెమీఫైనల్లో ఖచనోవ్‌తో ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment