సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఐదేళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ చేరిన ఆంధ్ర ఇప్పుడు సెమీస్ బెర్తుపై కన్నేసింది. నేటి నుంచి స్థానిక సీఎస్‌ఆర్ శర్మ కాలేజీ మైదానంలో జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకర్ భరత్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు గత రన్నరప్ సౌరాష్ట్రతో తలపడుతుంది. సెమీస్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆంధ్రకు సౌరాష్ట్రను ఎదుర్కోవడం అంత సులభం కాదు కానీ... సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో స్థానిక అనుకూలతలతో పైచేయి సాధించాలని ఆంధ్ర భావిస్తోంది. నిజానికి ఈ సీజన్ ఆరంభంలో ఆంధ్ర నిలకడగా రాణించింది.
దీంతో ఎలైట్ ‘ఎ అండ్ బి’ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. అయితే లీగ్ దశ సాగేకొద్దీ ప్రతికూల ఫలితాలతో వెనుకబడింది. ఇక ముగింపుకొచ్చేసరికి వరుసగా రెండు పరాజయాలతో ఐదో స్థానానికి పడిపోయింది. టాపార్డర్‌లో జ్ఞానేశ్వర్, ప్రశాంత్‌లతోపాటు రికీ భుయ్, శ్రీకర్ భరత్‌లు రాణిస్తే ఆంధ్ర భారీస్కోరు సాధించే అవకాశముంటుంది. బౌలింగ్‌లో శశికాంత్, స్టీఫెన్, రఫీ మళ్లీ మెరిపించాలి. గత రన్నరప్ సౌరాష్ట్ర మేటి ఆల్‌రౌండ్ జట్టు. ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడింది. మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందిన సౌరాష్ట్ర నాలుగు మ్యాచ్‌ల్ని ‘డ్రా’ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment