గెలిచి నిలిచిన భారత్ | keep quarterfinal chances alive | Sakshi
Sakshi News home page

గెలిచి నిలిచిన భారత్

Published Sun, Dec 8 2013 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

గెలిచి నిలిచిన భారత్

గెలిచి నిలిచిన భారత్

న్యూఢిల్లీ:  రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు సత్తాచాటారు. ఆట ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ తర్వాత చెమటోడ్చి గెలిచారు. జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ పూల్ ‘సి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా 3-2తో కెనడాపై విజయం సాధించింది.

తాజా విజయంతో యువ భారత్ ఈ పూల్‌లో క్వార్టర్ ఫైనల్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి. ఆట మొదలైన మూడో నిమిషంలోనే కెప్టెన్ సుకి పనేసర్ ఫీల్డ్ గోల్‌తో కెనడాకు శుభారంభమిచ్చాడు.

 దీంతో భారత్ స్కోరు సమం చేసేందుకు తమ దాడులకు పదునుపెట్టింది. ఎట్టకేలకు ఆట 30వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ తమకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి స్కోరును 1-1తో సమం చేశాడు. అనంతరం ద్వితీయార్ధంలో ఇరు జట్లు మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు చెమటోడ్చాయి. ఈ క్రమంలో గోర్డాన్ జాన్‌స్టన్ ఆట 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2-1తో మళ్లీ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీనికి ఆరు నిమిషాల వ్యవధిలోనే ఆకాశ్‌దీప్ సింగ్ (57వ ని.) చక్కని ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేశాడు. 2-2తో ఆట డ్రాగా ముగుస్తుందనుకుంటున్న తరుణంలో... 69వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీన్ని గుర్జిందర్ సింగ్ గోల్‌గా మలచి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ నెల 10న దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే నాకౌట్‌కు అర్హత సంపాదిస్తుంది. మెరుగైన గోల్స్ తేడాతో ఉన్న కొరియా కనీసం డ్రా చేసుకున్నా క్వార్టర్స్‌కు చేరుతుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొరియా 2-3తో ఓడింది. దీంతో ఈ పూల్‌లో నెదర్లాండ్స్ క్వార్టర్స్ బెర్తు సాధించింది.
 జర్మనీ చేతిలో పాక్ చిత్తు
 డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ బోణీ చేయగా, యూరోపియన్ చాంపియన్ బెల్జియం వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఎలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 6-1తో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. జర్మనీ తరఫున క్రిస్టోఫర్ రుహుర్ (2, 18, 26వ ని.) మూడు గోల్స్ చేయగా, లుకాస్ విండ్‌ఫెడర్ (10వ ని.), అలెగ్జాండర్ స్కాలకొఫ్ (59వ ని.), నిక్లాస్ బ్రూన్స్ (69వ ని.) తలా ఓ గోల్ చేశారు. పాక్ తరఫున నమోదైన ఒకే ఒక్క గోల్‌ను సాకిల్ అమ్మద్ సాధించాడు. ఇదే పూల్‌లో బెల్జియం 5-0తో ఈజిప్టుపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement