
దోహా: ఆద్యంతం దూకుడుగా ఆడిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తొమ్మిదోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోలాండ్‌తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్ తేడాతో పోలాండ్ జట్టును ఓడించింది. ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ జిరూడ్ (44వ ని.లో) ఒక గోల్ చేయగా... ఎంబాపె (74వ, 90+1వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్ జట్టుకు కెప్టెన్ లెవన్‌డౌస్కీ (90+9వ ని.లో) ఏకైక గోల్ అందించాడు.
ఆరంభంలో ఫ్రాన్స్‌ను నిలువరించిన పోలాండ్ తొలి అర్ధభాగం చివర్లో తడబడింది. ఎంబాపె అందించిన పాస్‌ను జిరూడ్ లక్ష్యానికి చేర్చడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. జిరూడ్ కెరీర్‌లో ఇది 52వ గోల్. ఈ గోల్‌తో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్) పేరిట ఉన్న రికార్డును జిరూడ్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్, సెనెగల్ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment