Olivier girud
-
Qatar FIFA World Cup 2022: ఫ్రాన్స్ జోరు...
దోహా: ఆద్యంతం దూకుడుగా ఆడిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తొమ్మిదోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోలాండ్‌తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్ తేడాతో పోలాండ్ జట్టును ఓడించింది. ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ జిరూడ్ (44వ ని.లో) ఒక గోల్ చేయగా... ఎంబాపె (74వ, 90+1వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్ జట్టుకు కెప్టెన్ లెవన్డౌస్కీ (90+9వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఆరంభంలో ఫ్రాన్స్‌ను నిలువరించిన పోలాండ్ తొలి అర్ధభాగం చివర్లో తడబడింది. ఎంబాపె అందించిన పాస్‌ను జిరూడ్ లక్ష్యానికి చేర్చడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. జిరూడ్ కెరీర్లో ఇది 52వ గోల్. ఈ గోల్‌తో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్) పేరిట ఉన్న రికార్డును జిరూడ్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్, సెనెగల్ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ ఆడుతుంది. -
దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్
జొహన్నెస్‌బర్గ్: బౌలర్లు మరోసారి విజృంభించడంతో పాకిస్తాన్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 381 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 65.4 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 153/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 120 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ ఒలివియర్ వరుస బంతుల్లో బాబర్ ఆజమ్ (29 బంతుల్లో 21; 5 ఫోర్లు), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (0)లను ఔట్ చేసి పాకిస్తాన్‌ను దెబ్బ తీశాడు. క్రీజులో నిలదొక్కుకున్న అసద్ షఫీఖ్ (71 బంతుల్లో 65; 11 ఫోర్లు)ను ఫిలాండర్ ఔట్ చేయడంతో పాక్ కోలుకోలేకపోయింది. షాదాబ్ ఖాన్ (47 నాటౌట్; 7 ఫోర్లు), హసన్ అలీ (22; 2 ఫోర్లు, సిక్స్) కాస్త పోరాడినా దక్షిణాఫ్రికా విజయాన్ని ఆలస్యం చేశారే తప్ప పాక్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఒలివియర్, రబడ మూడేసి వికెట్లు తీశారు. సిరీస్ మొత్తంలో 24 వికెట్లు తీసిన ఒలివియర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం... రెండో ఇన్సింగ్స్‌లో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించాయి. -
పాకిస్తాన్ 177 ఆలౌట్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా పేసర్ల ప్రతాపానికి పాకిస్తాన్ మరోసారి కుప్పకూలింది. గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టులో నలుగురు పేసర్లతో బరిలో దిగిన సఫారీలు... ప్రత్యర్థి ని తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌట్ చేశారు. ఒలివియర్ (4/48), స్టెయిన్ (3/48), రబడ (2/35) ధాటికి పాక్ నిలవలేకపోయింది. కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ (56), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ షాన్ మసూద్ (44) మాత్రమే కొద్దిగా పోరాడారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మార్క్రమ్ (78) అర్ధశతకం సాధించి వెనుదిరిగాడు. అమ్లా (24 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పాక్ స్కోరుకు సఫారీ జట్టు మరో 54 పరుగులు వెనుకబడి ఉంది. -
కఠోర శ్రమతోనే తిరిగొచ్చాను
ఒలివియర్ గిరూడ్ ఇంటర్వూ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) సీజన్ ఆరంభం నుంచి అర్సెనల్ స్ట్రయికర్ ఒలివియర్ గిరూడ్ గాయాలతో ఇబ్బంది పడుతూ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితుల నుంచి త్వరగానే కోలుకుని తన చివరి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో సత్తా చాటుకున్నాడు. మరోవైపు బయేర్న్ మ్యూనిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–5తో ఓడిపోవడంతో ఈ జట్టు టాప్‌లో ఉన్న చెల్సీ కన్నా 13 పాయింట్లు వెనకబడింది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) లివర్‌పూల్‌తో మ్యాచ్‌కు అర్సెనల్ సిద్ధమవుతోంది. సీజన్ ఆరంభంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను అధిగమించి... అద్భుత ఫామ్‌ను ఎలా అందుకున్నారు? అది కేవలం నా అంకితభావం, కఠోర శ్రమ ద్వారానే సాధ్యమైంది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నేను కాస్త నిస్పృహగానే ఉన్నాను. ఎందుకంటే గాయాల కారణంగా ఎక్కువ మ్యాచ్‌లను ఆడలేకపోయాను. అయితే నాలో ఉన్న ఆ బాధ, ఆవేదనను సరికొత్త ఉత్తేజంగా మార్చుకున్నాను. ఇప్పటికే మీ ఫామ్ చాటుకున్నారు. జట్టు కోసం మీరు చేసిన గోల్స్ ఎంతమేరకు ఉపయోగపడినట్టుగా భావిస్తున్నారు? జట్టులో ఉన్న స్ట్రయికర్ పని గోల్స్ చేయడమే. నేను బరిలోకి దిగాక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఫలితం సాధించగలిగాను. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాను. ఇదే జోరుతో ముందుకెళ్లి ఈ సీజన్లో మేం అనుకున్నది సాధిస్తాం. జట్టులో స్థానం కోసం సహచరుడితోనే పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తోంది? ఇది మీ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందా? అలా ఏమీ జరగదు. మంచి స్ట్రయికర్లతో సమతూకంతో ఉన్న జట్టు మాది. మైదానంలో మా మధ్య మంచి అవగాహన ఉంటుంది. అయినా పోటీ ఉండటం మంచిదే. అయినా నేను గోల్స్ సాధిస్తున్నప్పుడు జట్టు బయట ఎందుకు ఉంటాను? తుది జట్టులో మీకు చోటుపై ఇంకా అస్పష్టతే ఉన్నప్పుడు మరోసారి అర్సెనల్తోనే ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఎందుకంటే నేను అర్సెనల్ తరఫునే ఆడాలనుకుంటున్నాను. ఈ క్లబ్ తరఫున ప్రీమియర్ లీగ్‌తో పాటు మరిన్ని ట్రోఫీలు గెలవాలనుకుంటున్నాను. నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను.