ఒలివియర్ గిరూడ్ ఇంటర్వూ
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) సీజన్ ఆరంభం నుంచి అర్సెనల్ స్ట్రయికర్ ఒలివియర్ గిరూడ్ గాయాలతో ఇబ్బంది పడుతూ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితుల నుంచి త్వరగానే కోలుకుని తన చివరి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో సత్తా చాటుకున్నాడు. మరోవైపు బయేర్న్ మ్యూనిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–5తో ఓడిపోవడంతో ఈ జట్టు టాప్‌లో ఉన్న చెల్సీ కన్నా 13 పాయింట్లు వెనకబడింది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) లివర్‌పూల్‌తో మ్యాచ్‌కు అర్సెనల్ సిద్ధమవుతోంది.
సీజన్ ఆరంభంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను అధిగమించి... అద్భుత ఫామ్‌ను ఎలా అందుకున్నారు?
అది కేవలం నా అంకితభావం, కఠోర శ్రమ ద్వారానే సాధ్యమైంది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నేను కాస్త నిస్పృహగానే ఉన్నాను. ఎందుకంటే గాయాల కారణంగా ఎక్కువ మ్యాచ్‌లను ఆడలేకపోయాను. అయితే నాలో ఉన్న ఆ బాధ, ఆవేదనను సరికొత్త ఉత్తేజంగా మార్చుకున్నాను.
ఇప్పటికే మీ ఫామ్ చాటుకున్నారు. జట్టు కోసం మీరు చేసిన గోల్స్ ఎంతమేరకు ఉపయోగపడినట్టుగా భావిస్తున్నారు?
జట్టులో ఉన్న స్ట్రయికర్ పని గోల్స్ చేయడమే. నేను బరిలోకి దిగాక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఫలితం సాధించగలిగాను. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాను. ఇదే జోరుతో ముందుకెళ్లి ఈ సీజన్‌లో మేం అనుకున్నది సాధిస్తాం.
జట్టులో స్థానం కోసం సహచరుడితోనే పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తోంది? ఇది మీ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందా?
అలా ఏమీ జరగదు. మంచి స్ట్రయికర్లతో సమతూకంతో ఉన్న జట్టు మాది. మైదానంలో మా మధ్య మంచి అవగాహన ఉంటుంది. అయినా
పోటీ ఉండటం మంచిదే. అయినా నేను గోల్స్ సాధిస్తున్నప్పుడు జట్టు బయట ఎందుకు ఉంటాను?
తుది జట్టులో మీకు చోటుపై ఇంకా అస్పష్టతే ఉన్నప్పుడు మరోసారి అర్సెనల్‌తోనే ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు?
ఎందుకంటే నేను అర్సెనల్ తరఫునే ఆడాలనుకుంటున్నాను. ఈ క్లబ్ తరఫున ప్రీమియర్ లీగ్‌తో పాటు మరిన్ని ట్రోఫీలు గెలవాలనుకుంటున్నాను. నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను.
కఠోర శ్రమతోనే తిరిగొచ్చాను
Published Sat, Mar 4 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
Advertisement
Advertisement