దోహా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఊహకందని ప్రదర్శనతో అదరగొడుతున్న ఆఫ్రికా జట్టు మొరాకో మరో సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో మొరాకో తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి మ్యాచ్ కాగా... వేర్వేరు టోర్నీలలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడ్డాయి.
1963లో ఒక్కసారి ఫ్రాన్స్‌ను ఓడించిన మొరాకో ఆ తర్వాత ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 2007 తర్వాత ఈ రెండు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరుగుతుండటం విశేషం. ఎంబాపె, జిరూడ్, గ్రీజ్‌మన్, థియో హెర్నాండెజ్, చువమెని, గోల్‌కీపర్ హుగో లోరిస్‌లాంటి స్టార్ ఆటగాళ్లతో ఫ్రాన్స్ పటిష్టంగా ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న మొరాకో ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డు నెలకొల్పింది. కెనడాతో మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ మినహా ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా సమర్పించుకొని ఏకైక జట్టుగా మొరాకో నిలిచింది.
గ్రూప్ దశలో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును నిలువరించిన మొరాకో ఆ తర్వాత రెండో ర్యాంకర్ బెల్జియంపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 విశ్వవిజేత స్పెయిన్‌పై... క్వార్టర్ ఫైనల్లో 2016 యూరో చాంపియన్ పోర్చుగల్‌ను ఓడించి తమను ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని ఫ్రాన్స్‌కు హెచ్చరికలు పంపించింది. మొరాకో తరఫున యూసుఫ్ ఎన్ నెసిరి, అచ్రఫ్ హకీమి, హకీమ్ జియెచ్, సఫ్యాన్ అమ్రాబత్, గోల్‌కీపర్ యాసిన్ బోనో ప్రదర్శన మరోసారి కీలకం కానుంది. ఈ టోర్నీలో ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన 39 షాట్‌లను గోల్‌కీపర్ యాసిన్ బోనో నిలువరించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment