మాస్కో: ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకున్న భారత మహిళల చెస్ నంబర్‌వన్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి బ్లిట్జ్ విభాగంలో మాత్రం తడబడింది. సోమవారం ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో 32 ఏళ్ల హంపి నిర్ణీత 17 రౌండ్ల తర్వాత 10.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హంపికి 12వ స్థానం ఖాయమైంది. 14వ రౌండ్ వరకు రెండో స్థానంలో కొనసాగి స్వర్ణ, రజత, కాంస్య పతకాల రేసులో నిలిచిన హంపి వరుసగా 15, 16, 17వ రౌండ్‌లలో ఓడిపోయి పతకావకాశాలను చేజార్చుకుంది.
ఓవరాల్‌గా బ్లిట్జ్ టోర్నీలో హంపి ఎనిమిది గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా నాలుగు గేముల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 10 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కాటరీనా లాగ్నో 13 పాయింట్లతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 12.5 పాయింట్లతో అనా ముజిచుక్ (ఉక్రెయిన్) రజతం, 12 పాయింట్లతో తాన్ జోంగి (చైనా) కాంస్య పతకం దక్కించుకున్నారు.
ఎదురులేని కార్ల్‌సన్
ఓపెన్ ర్యాపిడ్ విభాగంలో టైటిల్ గెలిచిన ప్రపంచ నంబర్‌వన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ బ్లిట్జ్ విభాగంలోనూ విశ్వవిజేతగా అవతరించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత కార్ల్‌సన్, హికారు నకముర (అమెరికా) 16.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య రెండు గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న కార్ల్‌సన్... రెండో గేమ్‌లో నకమురను ఓడించి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తాజా విజయంతో కార్ల్‌సన్ చెస్‌లోని క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment