హంపి అ‘ద్వితీయం’ | Grandmaster Koneru Humpy becomes World Rapid Chess Champion for the second time | Sakshi
Sakshi News home page

హంపి అ‘ద్వితీయం’

Published Mon, Dec 30 2024 3:10 AM | Last Updated on Mon, Dec 30 2024 3:16 AM

Grandmaster Koneru Humpy becomes World Rapid Chess Champion for the second time

రెండోసారి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌

ఆనంద్‌ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్‌ ప్లేయర్‌గా రికార్డు

చివరిదైన 11వ రౌండ్‌లో నల్లపావులతో ఆడి నెగ్గిన భారత నంబర్‌వన్‌

110 మంది పాల్గొన్న టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానం

60 వేల డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం

రేపటి నుంచి ప్రపంచ బ్లిట్జ్‌ టోర్నీలో బరిలోకి  

గెలవాలన్న సంకల్పం... సరైన సన్నద్ధత ఉంటే... వయసు అనేది ఒక అంకె మాత్రమేనని... గొప్ప విజయాలు వాటంతట అవే వస్తాయని... రెండున్నర దశాబ్దాలుగా అంతర్జాతీయ మహిళల చెస్‌లో భారత ముఖచిత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆణిముత్యం కోనేరు హంపి మరోసారి నిరూపించింది. సెకన్ల వ్యవధిలో చకచకా ఎత్తులు వేయాల్సిన ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో 37 ఏళ్ల హంపి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2019లో తొలిసారి జగజ్జేతగా నిలిచిన హంపి గత ఏడాది టైబ్రేక్‌లో త్రుటిలో ప్రపంచ టైటిల్‌ను కోల్పోయింది. 

ఈసారి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా... ఒకదశలో టైటిల్‌ నెగ్గే అవకాశాలు కనిపించకపోయినా... తన అనుభవాన్నంతా రంగరించి... రౌండ్‌ రౌండ్‌కూ ముందుకు దూసుకొచ్చి చివరి రౌండ్‌లో నల్ల పావులతో ఆడుతూ ప్రత్యర్థిని ఓడించి దర్జాగా విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 110 మంది క్రీడాకారిణుల మధ్య స్విస్‌ ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ (2003, 2017) తర్వాత ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను రెండుసార్లు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా... జు వెన్‌జున్‌ (చైనా) తర్వాత రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా నిలిచిన రెండో మహిళా క్రీడాకారిణిగా హంపి గుర్తింపు పొందింది.  

న్యూయార్క్‌: ఈ ఏడాది విశ్వ చదరంగ వేదికపై మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్‌ కోనేరు హంపి విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ముగిసిన ర్యాపిడ్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల హంపి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 110 మంది క్రీడాకారిణల మధ్య స్విస్‌ ఫార్మాట్‌లో 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను దక్కించుకుంది. 

విజేతగా నిలిచిన హంపికి 60 వేల డాలర్ల (రూ. 51 లక్షల 23 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 10వ రౌండ్‌ ముగిశాక హంపితోపాటు మరో ఆరుగురు క్రీడాకారిణులు జు వెన్‌జున్‌ (చైనా), కాటరీనా లాగ్నో (రష్యా), టాన్‌ జోంగి (చైనా), ఇరినె ఖరిస్మా సుకందర్‌ (ఇండోనేసియా), ద్రోణవల్లి హారిక (భారత్‌), అఫ్రూజా ఖమ్‌దమోవా (ఉజ్బెకిస్తాన్‌) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ రేసులో నిలిచారు. 

అయితే చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 67 ఎత్తుల్లో ఖరిస్మా సుకందర్‌పై గెలుపొందడం... జు వెన్‌జున్, కాటరీనా లాగ్నో, హారిక, టాన్‌ జోంగి, అఫ్రూజా తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో హంపికి టైటిల్‌ ఖరారైంది. 8 పాయింట్లతో జు వెన్‌జున్, కాటరీనా లాగ్నో, టాన్‌ జోంగి, హారిక, అఫ్రూజా, అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (స్విట్జర్లాండ్‌) ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. 

మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఈ ఆరుగురి ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. జు వెన్‌జున్‌కు రెండో స్థానం, కాటరీనాకు మూడో స్థానం లభించాయి. టాన్‌ జోంగి నాలుగో స్థానంలో, హారిక ఐదో స్థానంలో, కొస్టెనిక్‌ ఆరో స్థానంలో, అఫ్రూజా ఏడో స్థానంలో నిలిచారు. 

ఓటమితో మొదలు... గెలుపుతో ముగింపు 
ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హంపి 10వ సీడ్‌గా బరిలోకి దిగింది. తొలి రౌండ్‌లో అమీనా కైర్‌బెకోవా (కజకిస్తాన్‌) చేతిలో హంపి ఓడిపోయింది. ఆ తర్వాత రెండో రౌండ్‌లో జేనాబ్‌ (అజర్‌బైజాన్‌)పై, మూడో రౌండ్‌లో సలోమి మెలియా (జార్జియా)పై గెలిచి... అల్మీరా (ఫ్రాన్స్‌)తో నాలుగో రౌండ్‌ గేమ్‌ను  ‘డ్రా’ చేసుకుంది. తొలి రోజు నాలుగు రౌండ్‌లు ముగిశాక హంపి 2.5 పాయింట్లతో 38వ స్థానంలో ఉంది. రెండో రోజు హంపి అద్భుతంగా ఆడింది. ఆడిన నాలుగు రౌండ్‌లలోనూ గెలిచింది. 

జెన్నిఫర్‌ యు (అమెరికా)పై, వంతిక అగర్వాల్‌ (భారత్‌)పై, తుర్ముంక్‌ ముంఖ్‌జుల్‌ (మంగోలియా)పై, నినో బత్సియాష్‌విలి (జార్జియా)పై హంపి విజయం సాధించింది. ఎనిమిది రౌండ్‌లు ముగిశాక హంపి 6.5 పాయింట్లతో జు వెన్‌జున్, హారికలతో కలిసి సంయక్తంగా అగ్రస్థానానికి చేరుకుంది. చివరిరోజు జు వెన్‌జున్, కాటరీనాలతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి చివరి గేమ్‌లో ఖరిస్మాపై గెలిచి టాప్‌ ర్యాంక్‌ను ఖరారు చేసుకుంది. 

సోమవారం నుంచి  ఈ టోర్నీలో మహిళల విభాగంలో భారత్‌ నుంచి ఎనిమిది మంది పోటీపడ్డారు. 7 పాయింట్లతో దివ్య దేశ్‌ముఖ్‌ 21వ ర్యాంక్‌లో, 6.5 పాయింట్లతో పద్మిని రౌత్‌ 26వ ర్యాంక్‌లో, 5.5 పాయింట్లతో వైశాలి 52వ ర్యాంక్‌లో, 5 పాయింట్లతో వంతిక అగర్వాల్‌ 67వ ర్యాంక్‌లో, 5 పాయింట్లతో నూతక్కి ప్రియాంక 71వ ర్యాంక్‌లో, 5 పాయింట్లతో సాహితి వర్షిణి 77వ ర్యాంక్‌లో నిలిచారు. 

ఓవరాల్‌గా ఈ ఏడాది భారత చెస్‌ కొత్త శిఖరాలను అందుకుంది.  ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా... గత నెలలో పురుషుల క్లాసికల్‌ ఫార్మాట్‌లో దొమ్మరాజు గుకేశ్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు.  

4 ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో హంపి సాధించిన పతకాలు. 2012లో కాంస్య పతకం నెగ్గిన హంపి... 2019లో స్వర్ణం, 2023లో రజతం, 2024లో స్వర్ణం గెలిచింది.  

అర్జున్‌కు ఐదో స్థానం 
ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఓపెన్‌ విభాగంలో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. రెండో రోజు గేమ్‌లు ముగిశాక టైటిల్‌ రేసులో నిలిచిన భారత నంబర్‌వన్‌ ఇరిగేశి అర్జున్‌ ఆఖరి రోజు తడబడ్డాడు. పదో గేమ్‌లో అలెగ్జాండర్‌ గ్రిష్‌చుక్‌ (రష్యా) చేతిలో అర్జున్‌ ఓడిపోవడం అతని టైటిల్‌ అవకాశాలను దెబ్బ తీసింది. 

నిర్ణీత 13 రౌండ్ల తర్వాత అర్జున్‌ 9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ వొలోడార్‌ ముర్జిన్‌ 10 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. రష్యాకే చెందిన గ్రిష్‌చుక్, నిపోమ్‌నిషి 9.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి క్లీన్‌స్వీప్‌ చేశారు.

ఈ విజయం ఎంతో ప్రత్యేకం
‘సాక్షి’తో హంపి  
ప్రపంచ టైటిల్స్‌ సాధించడం కోనేరు హంపికి కొత్తేమీ కాదు. 26 ఏళ్ల క్రితం తొలిసారి ప్రపంచ అండర్‌–10 విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన హంపి ఆ తర్వాత 1998లో అండర్‌–12 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2000లో అండర్‌–14 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2001లో జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జగజ్జేతగా నిలిచింది. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి టోర్నీ టైటిల్స్‌ సాధించిన హంపి 2019లో ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఐదేళ్ల క్రితం సాధించిన తొలి ప్రపంచ ర్యాపిడ్‌ టైటిల్‌తో పోలిస్తే ఈసారి విజయం ఎంతో ప్రత్యేకమని న్యూయార్క్‌ నుంచి ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరించింది. హంపి అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... 

» ఈ ఏడాది వ్యక్తిగతంగా అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోలేదు. అందుకే ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ ర్యాపిడ్‌ టోర్నీలో బరిలోకి దిగాను. తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూశాను. అయినప్పటికీ ఆశ వదులుకోలేదు. రెండో గేమ్‌ నుంచి గెలుపు బాట పట్టి చివరకు టైటిల్‌ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. ఎప్పటిలాగే నాన్న గైడెన్స్‌ ఇచ్చారు. చెస్‌కు సంబంధించి చాలా గేమ్స్‌ ప్రాక్టీస్‌ చేశాను.  

» 2017లో బిడ్డకు జన్మనిచ్చాక కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉన్నా. ఇప్పుడు నేను టోర్నీలు ఆడేందుకు బయట వెళ్లినపుడు పాప నా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నా విజయాల వెనుక భర్త దాసరి అన్వేష్, తల్లిదండ్రులు లత, అశోక్‌ పాత్ర, సహకారం ఎంతో ఉంది. ఈ ప్రపంచ టైటిల్‌ వారికే అంకితం ఇస్తున్నాను.  

» చివరి గేమ్‌ ఒకదశలో ‘డ్రా’ అవుతుందని భావించా. టైబ్రేక్‌కు సిద్ధంగా ఉన్నా. అయితే నా ప్రత్యర్థి చేసిన తప్పిదాన్ని సది్వనియోగం చేసుకొని విజయాన్ని దక్కించుకున్నా. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్‌ టోర్నీలో నిలకడగా రాణించాను. అయితే టైబ్రేక్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచినందుకు చాలా నిరాశ చెందాను. ఈసారి గెలిచినందుకు ఆనందంగా ఉన్నా. నేటి నుంచి మొదలయ్యే ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లోనూ మళ్లీ పతకం సాధించేందుకు కృషి చేస్తా. 2022లో ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాను.  

హంపికి వైఎస్‌ జగన్‌ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత గ్రాండ్‌మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతో పాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసిస్తూ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా తన ఖాతాలో పోస్టు చేశారు. 

‘ప్రతిష్టాత్మకమైన 2024 ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించడం అందరికీ గర్వకారణం. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. హంపి నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్‌ క్రీడాకారిణిగా నిలిచింది. భవిష్యత్తులో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement