
‘లారెస్’ అవార్డు రేసు నుంచి అవుట్
లండన్: ప్రపంచ నంబర్‌వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘లారెస్’ అవార్డుకు దూరమయ్యాడు. ఇటీవల అతనిపై మూడు నెలల నిషేధం విధించడంతో ‘స్పోర్ట్స్ ఆస్కార్’గా ప్రఖ్యాతిగాంచిన ఈ అవార్డు బరిలో లేకుండా పోయాడు. లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీ (ఎల్‌డబ్ల్యూఎస్‌ఏ) అతని నామినేషన్‌ను ఉపసంహరించింది. దీంతో సినెర్ రేసులో లేడు. ఈ విషయాన్ని ఎల్‌డబ్ల్యూఎస్‌ఏ చైర్మన్ సీన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ ధ్రువీకరించారు.
ఇటలీ సూపర్‌స్టార్ సినెర్‌పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) విధించిన నిషేధం అమలవుతుండటంతో అవార్డు బరి నుంచి అతని పేరును తప్పించినట్లు తెలిపారు. ‘డోపింగ్ ఉదంతం దరిమిలా నిషేధంపై ‘వాడా’తో పాటు టెన్నిస్ వర్గాలతో చర్చించాం. నిషేధంలో ఉన్న ఆటగాడు విశ్వఖ్యాతిగాంచిన అవార్డు బరిలో ఉండటం సమంజసం కాదనే నిర్ణయానికి వచ్చాం.
దీంతో సినెర్ నామినేషన్‌ను ఉపసంహరించాలని నిర్ణయించాం. దీనిపై సినెర్, అతని బృందానికి సమాచారమిచ్చాం’ అని ఫిట్జ్‌ప్యాట్రిక్ వెల్లడించారు. 23 ఏళ్ల సినెర్ గతేడాది మార్చిలోనే నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించింది.
‘కావాలని తీసుకోలేదు. మర్ధన తైలం, లేదంటే ఇతరత్రా మందుల ద్వారా అది తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే’ యానిక్ స్వీయ వాంగ్మూలాన్ని ఐటీఐఏ పరిగణించి తదుపరి చర్యలు తీసుకోలేదు. దీన్ని యావత్ క్రీడావర్గాలు తప్పుబట్టాయి. ఐటీఐఏ పక్షపాత వైఖరిని గర్హించాయి.
సెర్బియా దిగ్గజం జొకోవిచ్ సహా పలువురు టెన్నిస్ స్టార్లు... ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ని‘బంధనాలు’ అంటూ బాహాటంగానే దుమ్మెత్తి పోశారు. ‘వాడా’ సైతం అతని రెండు శాంపిల్స్ (నమూనాలు) పాజిటివ్ అని తేలాయి కాబట్టి కనీసం ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టుకు అప్పీల్ చేసింది. చివరకు సినెర్–ఐటీఐఏ–వాడాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 15న మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా నిషేధం విధించినప్పటికీ ఈ సీజన్‌లో అతని గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వేటకి ఏ ఇబ్బంది లేకపోయింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకున్న సినెర్... నిషేధం ముగిశాక తదుపరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ (మే 25 నుంచి)లో పోటీపడతాడు.
ఇవీ చదవండి
చెస్ ప్రపంచం సంతాపం
అంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ స్పాస్కీ (Boris Spassky-88) కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్(Former World Champion) మరణించిన విషయాన్ని ‘ఫిడే’ గురువారం ప్రకటించింది. స్పాస్కీ మరణం పట్ల చెస్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. గ్యారీ కాస్పరోవ్, లెవాన్ ఆరోనియాన్, సుసాన్ పోల్గర్, విశ్వనాథన్ ఆనంద్ తదితరులు స్పాస్కీ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
ఫైనల్లో అనిరుద్ జోడీ
బెంగళూరు: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోరీ్నలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) ద్వయం 6–4, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంటపై గెలుపొందింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు చెరో సెట్ సొంతం చేసుకున్నాయి.
నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో అనిరుధ్–రే హో ద్వయం కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీతో అనిరుద్–రే హో జంట తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ 6–3, 7–6 (8/6)తో సిద్ధాంత్–పరీక్షిత్ (భారత్)లపై నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment