ఆ అమ్మాయి చదువులో చాలా చురుకు.. స్కూల్ దాటి కాలేజ్‌లోకి వచ్చిన తర్వాతా అదే కొనసాగింది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కళాశాలలో ప్రవేశం. కానీ టేబుల్ టెన్నిస్ కోసం అర్ధాంతరంగా చదువు వదిలేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. టీనేజ్‌లోనే పేరున్న కంపెనీలు మోడలింగ్ కోసం ఆమెను సంప్రదించాయి. కానీ టేబుల్ టెన్నిస్ కోసం వాటన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఎందుకంటే ఆమె ధ్యాసంతా ఆటపైనే కాబట్టి! ఒక క్రీడాకారిణిగా ఎదగాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆమె అన్నింటినీ పక్కన పెట్టింది. కఠిన శ్రమ, పట్టుదల, అంకితభావంతో ఆటలోనే పైకి ఎదిగింది. ఆరంభ అవరోధాలను దాటి కామన్వెల్త్ పతకాల విజేతగా, ఒలింపియన్‌గా నిలిచింది. టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో తన పేరు లిఖించుకున్న ఆ ప్యాడ్లరే మనికా బత్రా.
29 ఏళ్ల మనికా ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. గత రెండు సందర్భాల్లో తనకు దక్కకుండా పోయిన పతకాన్ని ఈసారి ఎలాగైనా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
దాదాపు రెండున్నరేళ్ల క్రితం మనికా బత్రా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోయినా గతంలో ఒలింపిక్స్ ఆడిన భారత ఆటగాళ్లతో మెరుగైన ప్రదర్శన కనబరచి మూడో రౌండ్ వరకు చేరింది. అయితే ఒలింపిక్స్ ముగిసిన కొద్ది రోజులకే ఆమెకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మ్యాచ్‌లు జరిగే సమయంలో కోర్టు పక్కనుంచి భారత జట్టు కోచ్ సౌమ్యదీప్ రాయ్ సూచనలను తీసుకునేందుకు ఆమె అంగీకరించలేదు. తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేను అక్కడికి వచ్చేందుకు అధికారులు అంగీకరించకపోగా.. కోచ్ లేకపోయినా ఫర్వాలేదని, అలాగే ఆడతానని ఆమె చెప్పేసింది.
అర్జున అవార్డ్ అందుకుంటూ..
ఇది టీటీఎఫ్‌ఐకి ఆగ్రహం తెప్పించింది. అందుకే మనికాపై చర్య తీసుకునేందుకు సిద్ధమైంది. దాంతో మనికా కోర్టు మెట్లెక్కింది. అంతటితో ఆగిపోకుండా తన నిరసనకు కారణాన్ని కూడా వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ సందర్భంగా సౌమ్యదీప్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించారంటూ సంచలన విషయాన్ని వెల్లడించింది. తన అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సుతీర్థ ముఖర్జీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు తనను మ్యాచ్ ఓడిపొమ్మని చెప్పాడంటూ బయటపెట్టింది. షోకాజ్ నోటీసుతో తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని తెలిపింది.
చివరకు కోర్టు మనికా ఆవేదనను అర్థంచేసుకుంది. టీటీఎఫ్‌ఐలో పూర్తి ప్రక్షాళన కార్యక్రమం జరిగి అధికారులు మారాల్సి వచ్చింది. సాధారణంగా అగ్రశ్రేణి ప్లేయర్లు ఏ ఆటలోనైనా జాతీయ సమాఖ్యతో గొడవకు దిగరు. భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే, రాజీ మనస్తత్వంతోనే ఉంటారు. కానీ కెరీర్‌లో అగ్రస్థానానికి ఎదుగుతున్న దశలో ఒక 27 ఏళ్ల ప్లేయర్ అధికారులతో తలపడింది. ఇది టీటీ కోర్టు బయట ఆమె పోరాటానికి, ధైర్యానికి సంకేతం. అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు మాత్రమే కాదు.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తాను నిలబడగలననే ధైర్యాన్ని ఆమె చూపించింది.
కుటుంబసభ్యుల అండతో..
ఢిల్లీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది మనికా. ముగ్గురు సంతానంలో ఆమె చిన్నది. అన్న సాహిల్, అక్క ఆంచల్ టేబుల్ టెన్నిస్ ఆడటం చూసి నాలుగేళ్ల వయసులో తాను కూడా అటు వైపు ఆకర్షితురాలైంది. చాలామంది ప్లేయర్ల తరహాలోనే ఒకరిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటే ఇతర కుటుంబసభ్యులు వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడపడం, తాము తెర వెనక్కి వెళ్లిపోవడం తరచుగా జరిగేదే. మనికా విషయంలో కూడా ఇదే పునరావృతమైంది.
తల్లి సుష్మతో..
ఆమె ఆటను మొదలుపెట్టినప్పుడు అందరిలాగే సరదాగా ఆడి ముగిస్తుందని అనుకున్నారు. కానీ ఆమెలో దానికి మించి అపార ప్రజ్ఞ ఉన్నట్లు కోచ్‌లు చెప్పడంతోనే కుటుంబ సభ్యులకు అర్థమైంది. ఆ తర్వాత మనికా విషయంలో మరో ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. అక్క ఆంచల్ కూడా ఆటపై తనకున్న పరిజ్ఞానంతో చెల్లికి మెంటార్‌గా మారి నడిపించింది. రాష్ట్రస్థాయి అండర్–8 టోర్నీ మ్యాచ్‌లో ఆ చిన్నారి ప్రతిభను చూసిన కోచ్ సందీప్ గుప్తా తన మార్గనిర్దేశనంతో శిక్షణకు తీసుకోవడంతో ఆటలో మనికా ప్రస్థానం మొదలైంది.
అగ్రస్థానానికి చేరి..
‘బ్యాడ్మింటన్‌లో కూడా కొన్నేళ్ల క్రితం వరకు భారత ఆటగాళ్లు అంతంత మాత్రమే ప్రదర్శన కనబరచారు. కానీ సైనా నెహ్వాల్, పీవీ సింధులాంటి వాళ్లు అద్భుత ప్రదర్శనతో దాని స్థాయిని పెంచారు. మన దేశంలో బ్యాడ్మింటన్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నేనూ అదే చేయాలనుకుంటున్నా. టీటీకి చిరునామాగా మారి మన దేశంలో ఆటకు ఆదరణ పెంచాలనేదే నా లక్ష్యం’ అని మనికా చెప్పింది.
నిజంగానే భారత టీటీకి సంబంధించి ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. మరో మహిళా ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంది. శాఫ్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు, వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీల్లో పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా 24వ స్థానానికి చేరుకొని ఆమె భారత్ తరఫున కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెకు ముందు ఎవరూ కూడా మహిళల సింగిల్స్‌లో ఇంత మెరుగైన ర్యాంక్ సాధించలేదు.
2018, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్‌తో.., 2018, ఐఐటీఎఫ్ ‘ద బ్రేక్‌త్రూ స్టార్’ అవార్డ్‌తో..
పతకాల జోరు..
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్‌లో మనికా అత్యుత్తమ ప్రదర్శన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కనబడింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ పోటీల్లో మనికా ఏకంగా నాలుగు వేర్వేరు విభాగాల్లో నాలుగు పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణం గెలుచుకున్న ఆమె.. మహిళల డబుల్స్‌లో రజత పతకం, మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం అందుకుంది.
అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. డబ్ల్యూటీటీ టోర్నీల్లోనైతే ఆమె ఖాతాలో పలు సంచలన విజయాలు నమోదయ్యాయి. ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో వరల్డ్ నంబర్ 2, మాజీ ప్రపంచ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)పై సాధించిన గెలుపు వాటిలో అత్యుత్తమైంది.
మూడో ప్రయత్నంలో..
మనికా బత్రా తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. ఆమె ఘనతలకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అర్జున, ఖేల్ రత్న పురస్కారాలు అందుకుంది. ఒకప్పుడు మోడలింగ్ వద్దనుకున్న ఆమె ఇప్పుడు టీటీలో స్టార్‌గా ఎదిగిన తర్వాత అలాంటివాటిలో చురుగ్గా భాగమైంది. ప్రఖ్యాత మేగజీన్ ‘వోగ్’ తమ కవర్‌పేజీలో మనికాకు చోటు కల్పించి అటు గేమ్ ప్లస్ ఇటు గ్లామర్ కలబోసిన ప్లేయర్ అంటూ కథనాలు ప్రచురించింది.
ఇతర ఫొటోషూట్‌ల సంగతి సరేసరి. కెరీర్‌లో ఎన్నో సాధించిన ఆమె ది బెస్ట్ కోసం చివరి ప్రయత్నం చేస్తోంది. 21 ఏళ్ల వయసులో తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన మనికా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకుండా అనుభవం మాత్రమే సాధించి తిరిగొచ్చింది. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతో మూడో రౌండ్‌కి చేరింది. ఇప్పుడు మరింత పదునెక్కిన ఆటతో చెలరేగితే పారిస్ ఒలింపిక్స్‌లో పతకం దక్కవచ్చు. ఈ లక్ష్యాన్ని మనికా అందుకోవాలని భారత అభిమానులందరూ కోరుకుంటున్నారు. – మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment